అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Traffic Jam | ఢిల్లీ–కోల్‌కతా హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. నాలుగు రోజులుగా ట్రాఫిక్ స్తంభించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
బీహార్ (Bihar)లోని ఔరంగాబాద్ – రోహ్తాస్ మధ్యలో భారీ వర్షానికి హైవేను వరద నీరు ముంచెత్తింది. దీంతో 65 కిలోమీటర్ల మేర భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. జాతీయ రహదారి 19 (NH-19)పై వరుసగా నాలుగో రోజు వేలాది మంది ప్రయాణికులు, ట్రక్ డ్రైవర్లు చిక్కుకుపోయారు. ఢిల్లీ (Delhi), కోల్‌కతా మధ్య కీలకమైన హైవేపై ట్రాఫిక్ స్తంభించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయినా అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం గమనార్హం.
Traffic Jam | కుండపోత వర్షాలతో..
బీహార్‌లో శుక్రవారం కుండపోత వర్షాలు కురిశాయి. దీంతో జాతీయ రహదారి 19పైకి వరద నీరు చేరింది. ఫలితంగా ట్రాఫిక్ జామ్ అయింది. రోహ్తాస్ నుంచి 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఔరంగాబాద్ వరకు విస్తరించింది. 24 నుంచి 30 గంటల్లో 5 నుంచి 7 కిలోమీటర్ల వేగంతో ముందుకు సాగుతున్నామని వాహనాల డ్రైవర్లు చెబుతున్నారు. శివసాగర్ సమీపంలో ఎన్హెచ్ఏఐ (NHAI) ఆరు లేన్ల రోడ్డు విస్తరణ పనుల చేపడుతుంది. రోడ్డు విస్తరణ పనులు, వర్షాలతో ట్రాఫిక్ జామ్ అయింది.
Traffic Jam | పట్టించుకోని అధికారులు
కీలకమైన జాతీయ రహదారిపై నాలుగు రోజులుగా వాహనాలు స్తంభించిపోయినా అధికారులు పట్టించుకోవడం లేదు. వారు ట్రాఫిక్ సమస్య తీర్చడానికి ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారుల సమన్వయ లోపంతో వాహనదారులు రోడ్డుపై నరకయాతన అనుభవిస్తున్నారు. సరైన ఆహారం, నీళ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Traffic Jam | చాయ్ బిస్కెట్లతో జీవిస్తున్నాం
ట్రాఫిక్ జామ్‌పై ఓ ట్రక్ డ్రైవర్ మాట్లాడుతూ.. మంగళవారం ఉదయం నుంచి బుధవారం సాయంత్రం వరకు 5 కిలోమీటర్లు మాత్రమే కదిలానని చెప్పాడు. ‘‘ఆహారం లేదు, రోడ్డు పక్కన లభించే చిన్న చిరుతిళ్లతో మేము జీవిస్తున్నాం, ”అని ఒడిశా నుండి ఢిల్లీకి ప్రయాణిస్తున్న ట్రక్ డ్రైవర్ దుబన్ కుమార్ తెలిపారు. మరో ట్రక్ డ్రైవర్ మాట్లాడుతూ.. తాను 24 గంటల్లో 20 కిలోమీటర్లు మాత్రమే ప్రయాణించానని చెప్పాడు. అయినా అధికారులు ఎవరు తమకు సాయం చేయడానికి రాలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. రోడ్డు పక్కన దొరికే చాయ్, బిస్కెట్లతో కడుపు నింపుకుంటున్నామని చెప్పాడు.