అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Trade Deal | భారత్–అమెరికా (India-America) మధ్య సోమవారం వాణిజ్య ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. భారత్‌పై విధిస్తున్న సుంకాలను 18 శాతం తగ్గిస్తామని యూఎస్ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.
డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) చేసిన ప్రకటనపై కాంగ్రెస్ పార్టీ మంగళవారం నరేంద్ర మోదీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించింది. ఈ ఒప్పందానికి సంబంధించిన కీలక వివరాలను వెల్లడించాలని డిమాండ్ చేసింది. “యుద్ధ విరమణలాగే, వాణిజ్య ఒప్పందం ప్రకటనను కూడా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేశారు. ఈ వాణిజ్య ఒప్పందం ‘మోడీ అభ్యర్థన మేరకే’ జరుగుతోందని పేర్కొనబడిందని కాంగ్రెస్ పేర్కొంది. అమెరికా కోసం వ్యవసాయ రంగాన్ని తెరవడంపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో భారతీయ రైతుల భద్రత, ప్రయోజనాలపై కాంగ్రెస్ ప్రశ్నలు లేవనెత్తింది.
Trade Deal | లోక్‌సభలో వాయిదా తీర్మానం
భారత-అమెరికా వాణిజ్య ఒప్పందంపై చర్చించాలని కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ (Congress MP KC Venugopal) మంగళవారం లోక్‌సభలో వాయిదా తీర్మానం ఇచ్చారు. భారత పరిశ్రమలు, రైతులకు ప్రతికూల పరిణామాలను కలిగిస్తుందని ఆయన ఆరోపించారు. ప్రధాని మోదీ (PM Modi) అభ్యర్థన మేరకు ఈ వాణిజ్య ఒప్పందం కుదిరినట్లు ట్రంప్ చెప్పారని గుర్తు చేశారు. భారత మార్కెట్లను అమెరికా వస్తువులకు సమర్థవంతంగా తెరుస్తుందని కూడా ఆయన పేర్కొన్నారని చెప్పారు. ఈ చర్య భారత పరిశ్రమలు, వ్యాపారులు, ఎంఎస్ఎంఈలు, రైతులకు ప్రతికూల పరిణామాలను కలిగించే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వాణిజ్య ఒప్పందంపై సభలో సమగ్రంగా చర్చించాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ జైరాం రమేష్ (MP Jairam Ramesh) కూడా యూరోపియన్ యూనియన్, అమెరికాతో వాణిజ్య ఒప్పందాలపై పార్లమెంటరీ చర్చకు డిమాండ్ చేశారు. ఈ ఒప్పందం న్యూఢిల్లీకి మరిన్ని వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేయడానికి సహాయపడుతుందని అమెరికా
చేసిన వాదనపై కేంద్రాన్ని విమర్శించారు.