అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Donald Trump | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ “చాలా అందంగా కనిపించే వ్యక్తి” అని ప్రశంసించారు. ఆయన పట్ల తనకు చాలా గౌరవం ఉందన్నారు. అదే సమయంలో ఆయన చాలా కఠినంగా ఉంటారని పేర్కొన్నారు.
భారతదేశం, అమెరికా (America) త్వరలో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోబోతున్నాయని నొక్కి చెప్పారు. దక్షిణ కొరియాలో జరిగిన ఆసియా పసిఫిక్ ఆర్థిక సహకారంలో (అపెక్) ట్రంప్ మాట్లాడుతూ.. మే నెలలో భారతదేశం, పాకిస్తాన్ మధ్య జరిగిన వివాదంలో ప్రధాని మోదీ, పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్‌తో (Pakistan PM Shehbaz Sharif) తాను జరిపిన చర్చల గురించి ట్రంప్ మాట్లాడారు. ఇరు దేశాల మధ్య యుద్ధాన్ని ఆపడానికి తాను వాణిజ్యాన్ని ఎలా ఉపయోగించానో మరోసారి ప్రస్తావించారు. యుద్ధాన్ని ఆపాలని అంతులేని వాదనలు చేసిన అమెరికా అధ్యక్షుడు.. మే నెలలో ఏమి జరిగిందో మళ్లీ గుర్తుచేసుకున్నారు.
Donald Trump | వాణిజ్యంతో యుద్ధాన్ని ఆపేశా..
“భారతదేశంతో త్వరలోనే వాణిజ్య ఒప్పందం చేసుకుంటున్నాం. నాకు ప్రధాని మోదీ (PM Narendra Modi) పట్ల చాలా గౌరవం, ప్రేమ ఉంది. అణ్వస్త్ర దేశాలైన భారతదేశం – పాకిస్తాన్ మధ్య సైనిక ఘర్షణ తీవ్రమవుతున్న తరుణంలో నేను ప్రధాని మోదీకి ఫోన్ చేసి, మీతో వాణిజ్య ఒప్పందం చేసుకోలేనని చెప్పాను. పాకిస్తాన్ ప్రధానికి ఫోన్ చేసి, మీరు భారతదేశంతో పోరాడుతున్నందున మేము మీతో వ్యాపారం చేయలేమని చెప్పాను. దీంతో వారు యుద్ధాన్ని నిలువరించారని” అని ట్రంప్ పేర్కొన్నారు.
Donald Trump | మోదీ అంటే గౌరవం ఉంది..
ప్రధాని మోదీ చాలా అందంగా కనిపించే వ్యక్తి అని, తండ్రి లాంటివాడని ట్రంప్ అభివర్ణించారు. “వారు (మోదీ) బలమైన వ్యక్తులు. చాలా అందంగా కనిపించే వ్యక్తి. మీరు అతడ్ని నచ్చినట్లు చూస్తే తండ్రిలా కనిపిస్తాడు. అదే నచ్చకపోతే ఆయన చాలా కఠినంగా కనిపిస్తారని” ట్రంప్ వ్యాఖ్యానించారు. ట్రంప్ తన విలక్షణమైన శైలిలో, తన ప్రసంగాలలో ప్రధాని మోదీని ప్రస్తావిస్తూ తరచుగా ఉద్వేగభరితంగా ఉంటారు.

