HomeతెలంగాణACB Trap | రూ.ఐదు లక్షల లంచం డిమాండ్​.. ఏసీబీకి చిక్కిన టౌన్‌ ప్లానింగ్‌ అధికారి

ACB Trap | రూ.ఐదు లక్షల లంచం డిమాండ్​.. ఏసీబీకి చిక్కిన టౌన్‌ ప్లానింగ్‌ అధికారి

అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Trap | అవినీతి అధికారులు మారడం లేదు. నిత్యం ఏసీబీ దాడులు (ACB Raids) చేపడుతున్నా భయ పడటం లేదు.

రాష్ట్రంలోని పలు కార్యాలయాల్లో అవినీతి అధికారులు తిష్ట వేశారు. పైసలు ఇస్తేనే వారు పనులు చేస్తున్నారు. లేదంటే ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటున్నారు. కొందరు అధికారులు లంచం తీసుకోవడం కూడా హక్కుగా భావిస్తున్నారు. తాజాగా రూ.3.50 లక్షల లంచం తీసుకుండగా ఏసీబీ అధికారులు టౌన్​ ప్లానింగ్​ అధికారిని రెడ్ హ్యాండెడ్​గా పట్టుకున్నారు.

మేడ్చల్ జిల్లా (Medchal District) ఎల్లంపేట్‌ మున్సిపల్ ఆఫీసులో రాధాకృష్ణారెడ్డి టౌన్‌ ప్లానింగ్ అధికారి (Town Planning Officer)గా పని చేస్తున్నాడు. ఓ వెంచర్​కు అనుమతి ఇవ్వడానికి ఆయన ఏకంగా రూ.5 లక్షల లంచం డిమాండ్​ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. శనివారం బాధితుడి నుంచి రూ.3.50 లక్షల లంచం తీసుకుంటుండగా.. టౌన్​ ప్లానింగ్​ అధికారి రాధాకృష్ణారెడ్డిని ఏసీబీ అధికారులు(ACB Officers) రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకున్నారు. కాగా ఆయన గతంలో రూ.లక్ష లంచం తీసుకున్నాడు. దీంతో ఏసీబీ అధికారులు కార్యాలయంతో పాటు ఆయన ఇంట్లో తనిఖీలు చేపట్టారు.

ACB Trap | లంచం ఇవ్వొద్దు

ప్రజలు అధికారులకు లంచాలు ఇవ్వొద్దని ఏసీబీ అధికారులు సూచిస్తున్నారు. ఎవరైనా లంచం అడిగితే భయపడకుండా ఏసీబీకి ఫోన్​ చేయాలని చెబుతున్నారు. 1064 టోల్​ ఫ్రీ నంబర్ (ACB Toll Free Number)​, వాట్సాప్ నంబర్​ 9440446106కు సమాచారం అందిస్తే అవినీతి అధికారుల పని పడతామని భరోసా ఇస్తున్నారు.ఎంత మొత్తం లంచం అడిగినా.. వస్తు రూపంలో బహుమతులు అడిగినా తమకు ఫిర్యాదు చేయాలని కోరుతున్నారు. ఏసీబీకి ఫిర్యాదు చేస్తే తర్వాత తమ పనులు కావేమోనని పలువురు భయపడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అధికారులు తెలిపారు. ఎలాంటి భయం వద్దని, ఆ పని పూర్తయ్యే వరకు బాధితులకు ఏసీబీ అండగా ఉంటుందని అధికారులు భరోసా ఇస్తున్నారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.

Must Read
Related News