HomeUncategorizedIsrael - Iran | మూడో ప్ర‌పంచ యుద్ధం దిశ‌గా.. వేగంగా మారుతున్న ప‌రిణామాలు

Israel – Iran | మూడో ప్ర‌పంచ యుద్ధం దిశ‌గా.. వేగంగా మారుతున్న ప‌రిణామాలు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Israel – Iran | మ‌ధ్య‌ప్రాచ్యం(Middle East)లో జ‌రుగుతున్న ప‌రిణామాలు మూడో ప్ర‌పంచ యుద్ధానికి దారితీసేలా క‌నిపిస్తున్నాయి. రోజురోజుకు ప‌రిణామాలు వేగంగా మారుతుండ‌డం ఆందోళ‌న రేకెత్తిస్తోంది. ఇరాన్‌, ఇజ్రాయెల్ మ‌ధ్య యుద్ధం మ‌రిన్ని దేశాల‌కు విస్త‌రించే ప‌రిస్థితి నెల‌కొంది. ఇజ్రాయెల్‌(Israel)కు అండ‌గా నిలిచేందుకు అమెరికా, ఫ్రాన్స్ వంటి దేశాలు త‌మ బ‌ల‌గాల‌ను సిద్ధం చేస్తుండ‌గా, ఇరాన్ ముస్లిం దేశాల మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్టే ప‌నిలో ప‌డింది. ఇజ్రాయెల్‌కు వ్య‌తిరేకంగా చేస్తున్న పోరులో పాకిస్తాన్(Pakistan) త‌మ‌కు అండ‌గా నిలుస్తుంద‌ని ఇరాన్ తాజాగా ప్ర‌క‌టించింది.

Israel – Iran | పాకిస్తాన్ దాడి చేస్తుంద‌న్న ఇరాన్‌

ఇజ్రాయెల్ త‌మ‌పై అణ్వాయుధాలను ప్ర‌యోగిస్తే పాకిస్తాన్ రంగంలోకి దిగుతుంద‌ని, ఇజ్రాయెల్‌పై అణ్వాయుధ దాడులతో ప్రతీకారం తీర్చుకుంటుందని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) సీనియర్ జనరల్, ఇరాన్ జాతీయ భద్రతా మండలి సభ్యుడు మొహ్సేన్ రెజాయ్ వెల్ల‌డించారు. ఈ మేర‌కు త‌మ‌కు పాకిస్తాన్ హామీ ఇచ్చింద‌ని ఆయ‌న తెలిపారు. “ఇజ్రాయెల్ అణ్వాయుధాలను ఉపయోగిస్తే, మేము కూడా అణ్వాయుధాలతో ఆ దేశంపై దాడి చేస్తామని పాకిస్తాన్ మాకు చెప్పింది” అని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. పాకిస్తాన్ కు చెందిన షాహీన్-3 క్షిపణి(Shaheen-3 Missile) 2,700 కిలోమీటర్ల వరకు లక్ష్యాలను ఛేదించగలదు. ఇది ఇజ్రాయెల్‌లోని ఏ ప్రాంతాన్ని అయినా లక్ష్యంగా చేసుకునే దాడి చేసే అవ‌కాశ‌ముంది.

అయితే, ఇరాన్(Iran) వ్యాఖ్య‌ల‌పై పాక్ నుంచి ఎలాంటి స్పంద‌న రాలేదు. ఇజ్రాయెల్‌పై దాడులను స‌మ‌ర్థిస్తూ పాకిస్తాన్ బలమైన మౌఖిక మద్దతు ఇచ్చినప్పటికీ, ఇజ్రాయెల్‌పై అణ్వాయుధాలను ఉపయోగించాలనే ఉద్దేశ్యాన్ని అధికారికంగా ధ్రువీకరించలేదు. ముస్లిం దేశాలు ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఏకం కావాలని పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్(Pakistan Defense Minister Khawaja Asif) పిలుపునిచ్చారు. ఇజ్రాయెల్ దురాక్రమణ ఇరాన్‌ను మాత్రమే కాకుండా యెమెన్, పాలస్తీనాను కూడా లక్ష్యంగా చేసుకుంటుందని, ఐక్యంగా లేకపోవడం వల్ల అన్ని ముస్లిం దేశాలు ఇలాంటి దాడులకు గురవుతాయని హెచ్చరించారు.