అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Saudi Arabia | సౌదీ అరేబియాలో కుండపోత వర్షాలు (Heavy Rains) కురుస్తున్నాయి. దీంతో జెడ్డా (Jeddah) నగరం అతలాకుతలం అవుతోంది. ఆకస్మిక వర్షాలతో మక్కా ప్రావిన్స్‌లోని పలు ప్రాంతాలు నీట మునిగాయి.
సౌదీలో మంగళవారం నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. పశ్చిమ తీరంలో ఉన్న ప్రముఖ నగరమైన జెడ్డా నగరాన్ని వరదలు ముంచెత్తాయి. రోడ్లు, వీధులు జలయమం అయ్యాయి. ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయింది. భారీ వర్షాలతో అధికారులు జెడ్డాలో జరుగుతున్న రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (International Film Festival) రద్దు చేశారు.
Saudi Arabia | బయటకు రావొద్దు
సౌదీలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియోరాలజీ (NCM) హెచ్చరికలు జారీ చేసింది. భారీ వర్షంతో పాటు పిడుగులు, వడగళ్ల వర్షం, గంటకు 80-90 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. మదీనా, నార్తర్న్ బోర్డర్స్ సహా 8 ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. ప్రజలు అత్యవసరం అయితేనే బయటకు రావాలని సూచించింది. కాగా అధికారులు ఇప్పటికే జెడ్డా, రబిగ్, ఖులైస్ ప్రాంతాలలోని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. వర్షాలు తగ్గే వరకు విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు నిర్వహించాలని ఆదేశించారు.
Saudi Arabia | ఫిల్మ్ ఫెస్టివల్
సౌదీ అరేబియాలోని రెడ్ సీ ఫిల్మ్ ఫెస్టివల్ మంగళవారం జరగాల్సి ఉంది. భారీ వర్షంతో జెడ్డాను తాకడంతో దాని మార్కెట్, ఫెస్టివల్ ప్రాంతాలను మూసివేశారు. సౌక్ మార్కెట్ ప్రాంతం, కల్చర్ స్క్వేర్ స్క్రీనింగ్ హబ్ తదుపరి నోటీసు వచ్చేవరకు మూసి ఉంటాయని అధికారులు తెలిపారు. వాతావరణ పరిస్థితుల కారణంగా దయచేసి హోటల్లోనే ఉండాలని ఫిల్మ్ ఫెస్టివల్‌కు వచ్చిన అతిథులను కోరారు.