అక్షరటుడే, వెబ్‌డెస్క్: Tornadoes | అమెరికా(America)లోని పలు రాష్ట్రాలపై టోర్నడోలు విరుచుకుపడ్డాయి. సోమవారం ఏర్పడిన నాలుగు శక్తివంతమైన టోర్నడోలు టెక్సాస్ నుంచి కెంటకీ వరకు విధ్వంసం సృష్టించాయి. ఈ పెనుగాలుల ధాటికి అనేక భవనాలు కుప్పకూలాయి. విద్యుత్తు సరఫరా వ్యవస్థ తీవ్రంగా దెబ్బతినడంతో అనేక నగరాలు, పట్టణాలు అంధకారంలో ఉండిపోయాయి.
ఓక్లహామా(Oklahoma)లో పరిస్థితి దయనీయంగా ఉంది. ఇక్కడి ఓ అగ్నిమాపక కేంద్రంతో పాటు సుమారు పది గృహాలు నేలమట్టమయ్యాయి. విద్యుత్తు సౌకర్యం లేక సుమారు 1,15,000 మంది చీకటిలోనే గడపాల్సిన దుస్థితి నెలకొంది. టోర్నడోల ప్రభావంతో పలు జాతీయ రహదారులు (national highways) దెబ్బతిన్నాయి. అప్రమత్తమైన అధికారులు ముందుజాగ్రత్త చర్యగా వాహనాల రాకపోకలను నిలిపివేశారు.
ఉత్తర టెక్సాస్ (North Texas)లో వడగళ్ల వర్షాలు బీభత్సం సృష్టించాయి. సుమారు 11.4 సెంటీమీటర్ల వ్యాసంతో కూడిన పెద్ద వడగళ్లు పడినట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. మరోవైపు, సెయింట్ లూయిస్ (St.Louis) నగరంలో టోర్నడోల వల్ల కనీసం 5,000 భవనాలు దెబ్బతిన్నాయి. ఫలితంగా 1 బిలియన్ డాలర్ల వరకు ఆస్తి నష్టం వాటిల్లిందని చెబుతున్నారు. టోర్నడోల తాకిడికి కెంటకీ Kentucky తీవ్రంగా నష్టపోయింది. ఈ ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఇప్పటివరకు 12 మందికి పైగా మరణించారు.