Homeతాజావార్తలుTornadoes | సుడిగాలుల బీభత్సం.. విరిగిపడిన చెట్లు

Tornadoes | సుడిగాలుల బీభత్సం.. విరిగిపడిన చెట్లు

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సుడిగాలులు బీభత్సం సృష్టించాయి. లెంకలగడ్డ అటవీ ప్రాంతంలో గాలుల ధాటికి అనేక చెట్లు నేల కూలాయి. వందల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Tornadoes | జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సుడిగాలులు బీభత్సం సృష్టించాయి. పలిమెల మండలంలో లెంకలగడ్డ అటవీ ప్రాంతంలో (Lenkalagadda forest area) ఒక్కసారిగా ఈదురుగాలులు వీచాయి.

సుడిగాలుల ప్రభావంతో అటవీప్రాంతంలో కిలోమీటర్ల పరిధిలో చెట్లు విరిగిపడ్డాయి. సమీపంలోని పొలాలు ధ్వంసం అయ్యాయి. వందల ఎకరాల్లో చెట్లు, పత్తి, మిర్చి పంటలు (cotton and chilli crops) దెబ్బతిన్నట్లు సమాచారం. పెద్ద పెద్ద వృక్షాలు సైతం నేలకొరిగాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అయితే సుడిగాలలకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

కాగా.. గతేడాది మేడారం అడవుల్లో (Medaram forests) సైతం సుడిగాలులు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. 2024 సెప్టెంబర్ 4న  ములుగు జిల్లాలోని తాడ్వాయి అడవుల్లో 200 హెక్టార్లలో 50 వేలకు పైగా చెట్లు నేలకూలాయి. ఆ సమయంలో పెద్ద ఎత్తున గాలిదుమారం, సుడిగాలుల ప్రభావంతో మహావృక్షాలు సైతం కూలిపోయినట్లు అధికారులు తెలిపారు. దానిపై విచారణకు సైతం ఆదేశించారు. అయితే టోర్నడోల్లాంటి బలమైన సుడిగాలులతోనే ఈ స్థాయిలో నష్టం జరుగుతుందని గతంలో పేర్కొన్నారు.

తాజాగా.. మరోసారి జయశంకర్​ భూపాలపల్లి జిల్లాలో సుడిగాలులు (tornadoes) బీభత్సం సృష్టించడం ఆందోళన కలిగిస్తోంది. మొన్నటి వరకు వర్షాలు, వరదలతో ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు. సుడిగాలులు వీయడంతో పంటలకు సైతం తీవ్ర నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.