అక్షరటుడే, వెబ్డెస్క్ : Gita Jayanti | భగవద్గీత అనేది శ్రీకృష్ణ పరమాత్మ ప్రపంచానికి ప్రసాదించిన వేద జ్ఞాన సారం. వేల సంవత్సరాల క్రితం శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి వేద జ్ఞాన సారాన్ని బోధిస్తూ జీవిత అంతిమ లక్ష్యం గురించి జ్ఞానోదయం చేసిన రోజును గీతాజయంతి(Gita Jayanti )గా జరుపుకుంటున్నారు. సోమవారం(డిసెంబర్ 1) గీతా జయంతి.
మహాభారతం(Maha Bharatam)లోని భీష్మ పర్వంలో ఒక భాగమైన భగవద్గీత.. కురుక్షేత్ర యుద్ధ భూమిలో అర్జునుడికి శ్రీకృష్ణ పరమాత్మ చేసిన కర్తవ్య బోధ. ఇది హిందువుల పరమ పవిత్రమైన ఆధ్యాత్మిక గ్రంథమే కాదు.. వ్యక్తిత్వ వికాసానికీ సంబంధించినది.పాండవులు, కౌరవులకు మధ్య సయోధ్య కుదరకపోవడంతో కురుక్షేత్ర యుద్ధం అనివార్యమైంది. ఇరుపక్షాల సేనలు రెండువైపులా యుద్ధానికి సన్నద్ధమై ఉన్నాయి. ఆ సమయంలో వైరి పక్షంలో ఉన్న బంధువులు, మిత్రులను చూసి అర్జునుడు చలించిపోతాడు. వారిని ఎలా చంపడానికి మనసొప్పక అస్త్ర సన్యాసానికి సిద్ధమవుతాడు.
ఆ సమయంలో అతడి పార్థసారథి అయిన శ్రీకృష్ణ పరమాత్మ(Sri Krishna Paramatma) కల్పించుకుని కర్తవ్య బోధ చేస్తాడు. విశ్వరూపాన్ని చూపి జ్ఞానోపదేశం చేశాడు. దీంతో అర్జునుడు కర్తవ్యాన్ని తెలుసుకుని యుద్ధం చేస్తాడు. అర్జునుడికి చేసిన ఈ ఉపదేశమే భగవద్గీత (Bhagavadgeeta). సిద్ధాంత గ్రంథమైన భగవద్గీతలో వేద, వేదాంత, యోగ విశేషాలున్నాయి. భగవద్గీతలో మొత్తం 18 అధ్యాయాలున్నాయి. ఇవి మనిషి జీవితానికి సరిపడా జ్ఞానాన్ని అందిస్తాయి. ఈ పవిత్ర గ్రంథం అర్జునుడికే కాదు కర్తవ్య నిర్వహణలో భాగంగా ఎదురయ్యే సమస్యలకు, సందిగ్ధతకు సమాధానంగా నేటి ఆధునిక కాలంలోనూ ఉపయోగపడుతోంది. ద్వాపర యుగంలో మార్గశిర మాసం శుద్ధ ఏకాదశి(Ekadashi) రోజున భగవాన్ శ్రీకృష్ణుడు భగవద్గీతను ఉపదేశించినట్లుగా చెబుతారు. ఆరోజునే గీతా జయంతిగా జరుపుకుంటారు. భగవంతుడు చెప్పినట్లుగా భగవద్గీత సూచనలను సరిగ్గా పాటిస్తే క్లేశాలు తొలగి ఆందోళనల నుంచి విముక్తి లభిస్తుందన్నది భక్తుల విశ్వాసం.
Gita Jayanti | గీతా జయంతిన ఏం చేయాలంటే..
పవిత్రమైన గీతా జయంతి రోజున శ్రీకృష్ణుడిని ప్రత్యేకించి ఆరాధిస్తారు. భగవద్గీత పారాయణం చేయడం వల్ల సకల శుభాలు కలుగుతాయని భక్తులు నమ్ముతారు. ఈరోజున ఓం కృష్ణాయ నమః, ఓం శ్రీకృష్ణ శరణం మమ, ఓం నమో భగవతే వాసుదేవాయ (Om Namo Bhagavate Vasudevaya) అనే మంత్రాలను జపించాలని ఆధ్యాత్మికవేత్తలు సూచిస్తున్నారు.
