అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Toll Pass | జాతీయ రహదారులపై (National Highways) ఉన్న టోల్ గేట్ల వద్ద వాహనదారులు యేటా వేలాది రూపాయల ఫీజులు చెల్లిస్తున్నారు. ఎక్కువ రాకపోకలు సాగించే వారు టోల్ ఛార్జీలతో అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం వాహనదారులకు మేలు చేసేలా వార్షిక టోల్ పాస్ (Annual Toll Pass) తీసుకొచ్చిన విషయం తెలిసిందే.
రూ.మూడు వేలు పెట్టి పాస్ తీసుకుంటే టోల్ గేట్ల నుంచి 200 ట్రిప్పులు ప్రయాణించే అవకాశం ఉంది. ఈ పాస్‌తో వాహనదారులకు ఎంతో మేలు జరుగుతుంది. ఆగస్టు 15 నుంచి దేశవ్యాప్తంగా టోల్‌పాస్ విధానం అమలులోకి వచ్చింది. కానీ తెలంగాణలో (Telangana) మాత్రం రాలేదు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన వాహన్ పోర్టల్‌లో (Vahan Portal) తెలంగాణ వాహనాల వివరాలు నమోదు కాకపోవడమే ఇందుకు కారణం.
Toll Pass | ఆందోళనలో వాహనదారులు
వార్షిక టోల్పాస్తో వాహనదారులకు ఎంతో మేలు. నాన్ కమర్షియల్ వాహనాలకు రూ.మూడు వేలతో 200 సార్లు టోల్ గేట్ల మీదుగా వెళ్లేందుకు కేంద్రం ఈ పాస్ తీసుకొచ్చింది. అంటే ఒక్కొ టోల్గేట్ (Tollgate) వద్ద సగటున రూ.15 మాత్రమే కట్ అవుతాయి. ప్రస్తుతం వాహనదారులు రూ.100 వరకు టోల్ ఛార్జీలు చెల్లిస్తున్నారు. కొత్త విధానంతో తమకు మేలు జరుగుతుందని వాహనదారులు ఆశ పడ్డారు. పాస్‌లు తీసుకోవడానికి సిద్ధమయ్యారు. కానీ రాష్ట్రంలో ఈ విధానం ఇంకా అమలులోకి రాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. తెలంగాణ వాహనాల వివరాలను పోర్టల్‌లో నమోదు చేసి టోల్ పాస్ అందుబాటులోకి తీసుకు రావాలని కోరుతున్నారు. ఈ విషయమై కేంద్ర రవాణా శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికే లేఖ రాసినట్లు సమాచారం.
Toll Pass | సాంకేతిక కారణాలతో..
కేంద్ర రోడ్డు, రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో వాహన్ డేటాబేస్ పని చేస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రీజినల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసుల (ఆర్టీవో) నుంచి వాహనాల రిజిస్ట్రేషన్ వివరాలు ఒకే వ్యవస్థలోకి తీసుకురావడం దీని లక్ష్యం. వాహన యజమాని పేరు, రిజిస్ట్రేషన్, వెహికల్ వివరాలు డేటాబేస్‌లో ఉంటాయి. ఇప్పటికే చాలా రాష్ట్రాలు తమ వాహనాల సమాచారాన్ని డేటాబేస్‌తో అనుసంధానించాయి. తెలంగాణ ప్రభుత్వం మాత్రం సాంకేతిక కారణాలతో వాహన వివరాలు నమోదు చేయలేదు. దీంతో తాజాగా వార్షిక టోల్ పాస్ విధానం రాష్ట్రంలో అమలులోకి రాకుండాపోయింది. ప్రభుత్వం వివరాలు అప్డేట్ చేసిన అనంతరం టోల్ పాస్ విధానం రాష్ట్రంలో కూడా అమలులోకి రానుంది.