అక్షరటుడే, వెబ్‌డెస్క్ : India – Russia | భారత్, రష్యా మధ్య రక్షణ ఉత్పత్తుల కొనుగోళ్లు, వాణిజ్య సంబంధాలపై అమెరికా విమర్శలు గుప్పిస్తున్న వేళ.. భారత సైన్యం వాటిని దీటుగా తిప్పి కొట్టింది. 1971 ఆగస్టు 5 నాటి ఒక వార్తాపత్రిక క్లిప్పింగ్‌ను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ అగ్రరాజ్య వైఖరిని ఎండగట్టింది.
అందులో ఇండియా, పాకిస్తాన్ యుద్ధానికి ముందు అమెరికా(America) పాక్‌కు ఆయుధాలను ఎలా సరఫరా చేసిందో గుర్తు చేసింది. “ఈ రోజు, ఆ సంవత్సరం యుద్ధం ముదిరిన రోజు, ఆగస్టు 5, 1971” అనే శీర్షికతో ఉన్న భారత ఆర్మీ(Indian Army) చేసిన పోస్ట్.. అమెరికా దశాబ్దాలుగా పాకిస్తాన్ వైపు మొగ్గు చూపుతున్న తీరును ఎత్తిచూపింది. బంగ్లాదేశ్ దురాక్రమణ సమయంలో పాకిస్తాన్ ఆయుధాల కోసం నాటో దేశాలు, సోవియట్ యూనియన్‌ను ఎలా సంప్రదించిందో అప్పటి భారత రక్షణ శాఖ మంత్రి వీసీ శుక్లా(Indian Defense Minister VC Shukla) రాజ్యసభలో వెల్లడించిన వివరాలతో కూడిన వార్తా కథనాన్ని ఆర్మీ పోస్టు సోషల్ మీడియాలో చేసింది.
India – Russia | పాక్‌కు బాసటగా అమెరికా, చైనా
బంగ్లాదేశ్ విముక్తి కోసం భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతున్న రోజులవి. ఆయుధాలు, సైనిక మౌలిక వసతులు లేక పాకిస్తాన్(Pakistan) ఓటమి అంచుకు చేరింది. ఈ క్రమంలో ఆయుధాల కోసం దాయాది ఫ్రాన్స్‌తో పాటు అప్పటి యూనియన్ ఆఫ్ సోషలిస్ట్ సోవియట్ రిపబ్లిక్ (Union of Socialist Soviet Republics)ను అభ్యర్థించగా వారు నిరాకరించారు. ఈ నేపథ్యంలో అమెరికాతో పాటు చైనా పాకిస్తాన్‌కు ఆయుధాలను విక్రయించాయి. ఇదే విషయాన్ని అప్పటి రక్షణ శాఖ మంత్రి వీసీ శుక్లా రాజ్యసభలో వెల్లడించారు.
India – Russia | ట్రంపుకు సరైన సమాధానం..
రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(US President Donald Trump) అక్కసు వెళ్లగక్కుతున్న తరుణంలో ఇండియన్ ఆర్మీ నుంచి ఈ పోస్టు వెలువడింది. అమెరికా ద్వంద వైఖరిని ఎత్తిచూపుతూ ట్రంప్‌కు తగిన రీతిలో సైన్యం జవాబు ఇచ్చింది. పాశ్చాత్య దేశాల ఆంక్షలు ఉన్నప్పటికీ రష్యా చమురు నుంచి ఇండియా తక్కువ ధరకే చమురు కొనుగోలు చేస్తూ భారీగా లాభాలు గడిస్తోందని ఆరోపించిన ట్రంప్.. త్వరలోనే భారత్‌పై మరిన్ని సుంకాలు విధిస్తామని బెదిరించారు. ఈ నేపథ్యంలోనే ఆర్మీ తన పోస్టు ద్వారా ట్రంప్‌కు తగిన రీతిలో సమాధానం ఇచ్చింది.