HomeUncategorizedITR | ఐటీఆర్‌ దాఖలుకు నేడే చివరి తేదీ.. స్పష్టతనిచ్చిన ఐటీ డిపార్ట్‌మెంట్‌

ITR | ఐటీఆర్‌ దాఖలుకు నేడే చివరి తేదీ.. స్పష్టతనిచ్చిన ఐటీ డిపార్ట్‌మెంట్‌

- Advertisement -

అక్షర టుడే, వెబ్‌డెస్క్: ITR | గత ఆర్థిక సంవత్సరానికి(2024-25) గాను ఎలాంటి జరిమానాలు లేకుండా ఆదాయపు పన్ను రిటర్నులు (ITR) దాఖలు చేసేందుకు ఇచ్చిన గడువును పొడిగించినట్లు జరుగుతోన్న ప్రచారాన్ని ఆదాయపు పన్ను విభాగం (Income Tax Department) ఖండించింది.

ఐటీ రిటర్నుల(IT Returns) దాఖలుకు ఎలాంటి పొడిగింపు లేదని స్పష్టం చేసింది. సోమవారంతో (సెప్టెంబర్‌ 15) గడువు ముగియనుంది. ఇంకా ఫైల్‌ చేయని వారు ఈ రోజు రాత్రి 12 గంటలలోగా ఫైల్‌ చేయాలి. లేకపోతే ఐటీ డిపార్ట్‌మెంట్‌నుంచి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావొచ్చు.

ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ రిటర్న్‌ల దాఖలు గడువును ఈసారి జూలై 31 నుంచి ఆరు వారాలపాటు పొడిగించారు. ఇది సెప్టెంబర్‌ 15 రాత్రితో ముగియనుంది. అయితే దీనిని సెప్టెంబరు 30వ తేదీ వరకు పొడిగించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఐటీ డిపార్ట్‌మెంట్‌ రంగంలోకి దిగింది. ఆ ప్రచారం తప్పంటూ కొట్టిపారేసింది. ఐటీఆర్‌ దాఖలు గడువును పొడిగిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని, ఈరోజు రాత్రి 12 గంటలలోగా ఫైల్‌ చేయాలని సూచించింది.

ఆదాయపు పన్ను విభాగం అధికారికంగా ఇచ్చే అప్‌డేట్లను ఎప్పటికప్పుడు చూసుకోవాలని పన్ను చెల్లింపుదారులను కోరింది. ఐటీఆర్‌ ఫైలింగ్‌ (ITR filing), పన్ను చెల్లింపులపై సందేహాలను నివృత్తి చేసేందుకోసం 24 గంటలు పనిచేసే హెల్ప్‌ డెస్క్‌ ఉందని, కాల్స్‌, లైవ్‌ చాట్స్‌, వెబ్‌ సెషన్స్‌తోపాటు ఎక్స్‌లోనూ పన్ను చెల్లింపుదారులకు సపోర్ట్‌గా ఉంటున్నామని తెలిపింది. ఈ విషయాన్ని ఆదాయపు పన్ను విభాగం తమ ‘X’ ఖాతా ద్వారా పేర్కొంది. ఇప్పటివరకు దాదాపు 6 కోట్ల మందికిపైగా పన్ను చెల్లింపుదారులు ఈ ప్రక్రియను పూర్తి చేసినట్లు ఐటీ విభాగం పేర్కొంది. ఈ -వెరిఫై అయిన రిటర్నులు 5.51 కోట్లు ఉన్నాయని, ఇందులో 3.78 కోట్ల వరకూ పరిశీలన పూర్తయ్యిందని వివరించింది. రూ.3 లక్షలకు మించి ఆదాయం ఉన్నవారందరూ త్వరగా రిటర్నులు దాఖలు చేయాలని సూచించింది.

కొత్త, పాత పన్ను విధానంలో ఏది ప్రయోజనమో చూసుకోవాలని తెలిపింది. చివరి నిమిషం వరకు వేచి చూడకుండా వెంటనే ఐటీఆర్‌ ఫైల్‌ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. చివరి నిమిషం వరకు వేచి ఉంటే పోర్టల్‌పై భారం పడి హ్యాంగ్‌ అయ్యే అవకాశాలు ఉంటాయని, దీంతో సకాలంలో ఐటీఆర్‌ దాఖలు చేసే అవకాశాన్ని కోల్పోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. జరిమానాలు మరియు వడ్డీని నివారించడానికి (To avoid penalties and interest) త్వరగా ఐటీఆర్‌ దాఖలు చేయాలని సూచిస్తున్నారు.