అక్షరటుడే, వెబ్‌డెస్క్ : IND vs SA | భారత్- దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆసక్తికర దశకు చేరుకుంది. ఇప్పటికే మూడు మ్యాచ్‌లు పూర్తవగా, భారత్ 2-1 ఆధిక్యంలో కొనసాగుతోంది. లక్నోలో జరగాల్సిన నాలుగో టీ20 మ్యాచ్ (T20 Match) భారీ పొగమంచు కారణంగా రద్దు కావడంతో, ఇప్పుడు అహ్మదాబాద్ వేదికగా శుక్రవారం జరగనున్న చివరి మ్యాచ్‌నే సిరీస్ ఫలితాన్ని నిర్ణయించనుంది.
ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని టీమిండియా పట్టుదలగా ఉండగా, దక్షిణాఫ్రికా (South Africa) మాత్రం ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌ను డ్రాగా ముగించాలనే కృతనిశ్చయంతో బరిలోకి దిగుతోంది. దీంతో ఇరు జట్ల మధ్య హోరాహోరీ పోరు ఖాయంగా కనిపిస్తోంది.అయితే, కీలకమైన టీ20 ప్రపంచకప్‌కు ముందు భారత జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) ఫామ్ టీమిండియాకు ఆందోళన కలిగిస్తోంది. ఇటీవలి కాలంలో సూర్య వరుసగా భారీ ఇన్నింగ్స్ ఆడడంలో విఫలమవుతున్నాడు.
IND vs SA | హోరా హోరీ..
ఈ ఏడాది ఇప్పటివరకు ఆడిన 20 టీ20 మ్యాచ్‌లలో 18 ఇన్నింగ్స్‌లు బ్యాటింగ్ చేసిన సూర్య, ఒక్క హాఫ్ సెంచరీ కూడా నమోదు చేయలేకపోయాడు. ఈ సమయంలో కేవలం 213 పరుగులే చేయగా, అతడి సగటు 14.20గా నమోదైంది. కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సమయంలో ఫామ్ కోల్పోవడం టీమిండియా (Team India)కు ప్రధాన టెన్షన్‌గా మారింది. ఇక జట్టు కాంబినేషన్ విషయానికి వస్తే, లక్నో మ్యాచ్‌కు ముందు శుభ్‌మన్ గిల్ (Shubman Gill) ప్రాక్టీస్ సమయంలో గాయపడిన సంగతి తెలిసిందే. అతడు అహ్మదాబాద్ మ్యాచ్‌కు అందుబాటులో ఉండే అవకాశాలు తక్కువగా ఉండటంతో, ఓపెనింగ్‌లో సంజు శాంసన్‌కు అవకాశం దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. శాంసన్ ఓపెనర్‌గా మంచి రికార్డ్ కలిగి ఉన్నప్పటికీ, లోయర్ ఆర్డర్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. అయినప్పటికీ, ప్రత్యామ్నాయం అందుబాటులో ఉండటంతో భారత జట్టు ఎలాంటి రిస్క్ తీసుకునే అవకాశం లేదని తెలుస్తోంది.
ఆల్‌రౌండర్ల విభాగంలో హార్దిక్ పాండ్యా (Hardik Pandya), శివమ్ దూబే ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ప్లేయింగ్ ఎలెవన్‌లో కొనసాగుతూ జట్టుకు సమతుల్యత అందించారు. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ వీరి పాత్ర కీలకంగా మారనుంది. ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా మంచి ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. వ్యక్తిగత కారణాలతో మూడో టీ20కు దూరమైన జస్ప్రీత్ బుమ్రా, నాలుగో మ్యాచ్‌కు ముందు జట్టులో చేరాడు. ఇప్పుడు అహ్మదాబాద్ మ్యాచ్‌లో బుమ్రాకు ప్లేయింగ్ ఎలెవన్‌లో అవకాశం ఖాయమైతే, హర్షిత్ రాణాకు అవకాశం దక్కుతుందా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. అహ్మదాబాద్ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుందని అంచనా. దీంతో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశముండగా, బౌలర్లకు ఇది పెద్ద సవాల్‌గా మారనుంది. మొత్తంగా సిరీస్ నిర్ణయించే ఈ మ్యాచ్‌పై క్రికెట్ అభిమానుల్లో భారీ ఉత్కంఠ నెలకొంది.