అక్షరటుడే, వెబ్‌డెస్క్ :IPL 2025 | ఐపీఎల్ 2025 సీజన్ టైటిల్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bangalore) గెలుస్తుందని టీమిండియా మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్(Mohammad Kaif) అంచనా వేసాడు. ఈ సీజన్‌లో ఆర్‌సీబీ ఎన్నడూ లేని విధంగా ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరుస్తుందని చెప్పాడు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగంలో సమతూకంగా రాణించే జట్లకే టైటిల్ గెలిచే అవకాశాలు ఉంటాయని అభిప్రాయపడ్డాడు. భారత్-పాకిస్థాన్(India-Pakistan) మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్ 2025 సీజన్‌ను వారం పాటు వాయిదా వేసిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం ఇరు దేశాల మధ్య పరిస్థితులు చక్కబడడంతో శనివారం నుంచి ఐపీఎల్(IPL) రీస్టార్ట్ కానుంది. ఇప్పటికే ఐపీఎల్ రివైజ్డ్ షెడ్యూల్‌ను బీసీసీఐ(BCCI) ప్రకటించింది. ఈ షెడ్యూల్‌లో భాగంగా శనివారం జరిగే తొలి మ్యాచ్‌లో ఆర్‌సీబీ(RCB), కేకేఆర్(KKR) బెంగళూరు వేదికగా తలపడనున్నాయి. ఈ మ్యాచ్ నేపథ్యంలో మాట్లాడిన మహమ్మద్ కైఫ్.. ఆర్‌సీబీ ఆట తీరుపై ప్రశంసల జల్లు కురిపించాడు.
‘ఆర్‌సీబీ(RCB) ఈ సారి చాలా బాగా ఆడుతోంది. ఎన్నడూ లేని విధంగా సమష్టిగా రాణిస్తోంది. గతంలో ఆర్‌సీబీ బ్యాటింగ్ విభాగంపై మాత్రమే ఆధారపడేది. కానీ ఈసారి బౌలర్లు కూడా అదరగొడుతున్నారు. ముఖ్యంగా ఆర్‌సీబీ కెప్టెన్ రజత్ పటిదార్(RCB captain Rajat Patidar) తమ బౌలర్లను చక్కగా ఉపయోగించుకుంటున్నాడు. తనదైన కెప్టెన్సీతో ప్రత్యర్థులను తక్కువ స్కోరుకే కట్టడి చేస్తున్నాడు.
విరాట్ కోహ్లీ(Virat Kohli) ఎప్పటిలాగే బ్యాట్‌తో దుమ్మురేపుతున్నాడు. అయితే ఈ సారి బౌలర్లు కూడా సత్తా చాటుతూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. వారి ప్రదర్శనతో టైటిల్ గెలవగలమనే నమ్మకాన్ని కలిగించారు. సమష్టిగా రాణించే జట్టుకే టైటిల్ గెలిచే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ సీజన్‌లో ఆర్‌సీబీ(RCB) తప్పకుండా విజేతగా నిలుస్తుంది.’అని కైఫ్ జోస్యం చెప్పాడు.
ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 11 మ్యాచ్‌లు ఆడిన ఆర్‌సీబీ 8 విజయాలు సాధించి పాయింట్స్ టేబుల్‌లో రెండో స్థానంలో కొనసాగుతోంది. మరో విజయం సాధిస్తే ఆర్‌సీబీ ప్లే ఆఫ్స్ బెర్త్(RCB Play Offs Berth) ఖరారు అవుతుంది. అయితే ప్లే ఆఫ్స్ ముంగిట స్టార్ పేసర్ హజెల్ వుడ్ దూరమవ్వడం ఆ జట్టును కలవరపెడుతోంది.