అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Tirupati | తిరుపతి జిల్లా పాకాల మండలంలోని గాదంకి టోల్‌ప్లాజా(Toll Plaza) సమీప అడవిలో నాలుగు మృతదేహాలు బయటపడిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.
మొట్టమొదట మృతదేహాలను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా, సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఒక మహిళ మృతదేహం నేలపై పడిపోవడం, మరో పురుషుడి మృతదేహం చెట్టుకు వేలాడుతూ ఉండడం గుర్తించారు. పక్కనే రెండు గోతులు తీసి బాడీలని పూడ్చడం కూడా కనిపించడంతో ఘటన మరింత అనుమానాస్పదంగా మారింది.
Tirupati | డెత్ మిస్టరీపై విచారణ..
పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో మృతదేహాలు తమిళనాడుకు చెందినవిగా గుర్తించబడ్డాయి. మృతులు జయమాల (38), కళై సెల్వన్ (37), జయమాల కుమార్తె దర్శిని (9), వర్షిణి (3)గా గుర్తించారు. జయమాల భర్త వెంకటేశ్ మరియు బంధువులు తిరుపతి పోలీసు(Tirupati Police)లను సంప్రదించడంతో మృతుల గుర్తింపు ఖరారైంది. పోలీసుల దర్యాప్తు ప్రకారం.. వెంకటేశ్ తమిళనాడు(Tamil Nadu)లోని నాగపట్నం జిల్లా పి.కొంతై గ్రామానికి చెందిన వీవోసీ నగర్ నివాసితుడు. అతను కొంతకాలంగా కువైట్‌లో పని చేస్తున్నాడు. భార్య జయమాలకి అతను దాదాపు రూ. 40 లక్షల వరకు డబ్బులు పంపించాడు. అయితే ఆ మొత్తాన్ని జయమాల తన చిన్నమ్మ కుమారుడు కళైసెల్వన్‌తో కలిసి ఫైనాన్స్ వ్యాపారంలో పెట్టి నష్టపోయినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఈ విషయంలో వెంకటేశ్ పోలీసులకు చీటింగ్ కేసు కూడా పెట్టినట్లు సమాచారం. దీంతో సంబంధాలు మరింత ఉద్రిక్తంగా మారాయి. అనంతరం జయమాల, ఆమె కుమార్తెలు, కళైసెల్వన్ ఆచూకీ తెలియకుండా పోయారు. జులై 4న మిస్సింగ్ కేసునూ కుటుంబ సభ్యులు నమోదు చేశారు.అయితే భార్య, పిల్లల కోసం వెంకటేశ్, అతని కుటుంబ సభ్యులు వెతకడం, అదే సమయంలో వారి మృతదేహాలు లభ్యం కావడం అనేక అనుమానాలు కలిగిస్తున్నాయి. పోస్ట్‌మార్టం తర్వాత మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. పోలీసు అధికారులు వెంకటేశ్ మరియు ఆయన బంధువులను విచారిస్తున్నారు. అలాగే జయమాల కుటుంబ సభ్యుల నుంచి కూడా వివరాలు సేకరిస్తున్నారు. ఒకేసారి కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందడం అనేక ప్రశ్నలు లేవనెత్తేలా చేస్తుంది.