HomeUncategorizedMaoists | మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సెక్రెటరీగా తిరుపతి నియామకం

Maoists | మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సెక్రెటరీగా తిరుపతి నియామకం

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Maoists | మావోయిస్టులు కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ కేంద్ర కమిటీ సెక్రెటరీగా జగిత్యాల జిల్లాకు చెందిన తిప్పిరి తిరుపతిని నియమించారు.

పార్టీ కేంద్ర కమిటీ సెక్రెటరీగా ఉన్న నంబాల కేశవరావు (Nambala Keshava Rao) ఎన్​కౌంటర్​లో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆపరేషన్​ కగార్ (Operation Kagar)​లో భాగంగా ఛత్తీస్​గఢ్​లోని నారాయణపూర్​ జిల్లాలో మే నెలలో జరిగిన ఎన్​కౌంటర్ (Encounter)​లో నంబాల మృతి చెందారు. ఈ ఎన్​కౌంటర్​లో 27 మంది చనిపోయారు. కీలక నేత నంబాల మృతి చెందిన మూడున్నర నెలల తర్వాత సెక్రెటరీని నియమిస్తూ కేంద్ర కమిటీ నిర్ణయం తీసుకుంది.

Maoists | మరోసారి తెలుగు వారికి..

ఎన్​కౌంటర్​లో మరణించిన నంబాల కేశవరావుది ఆంధ్రప్రదేశ్​లోని శ్రీకాకుళం జిల్లా. ఆయన తర్వాత మళ్లీ తెలుగు వ్యక్తికే కేంద్ర కమిటీ సెక్రెటరీ బాధ్యతలు అప్పగించడం గమనార్హం. గతంలోనూ కేంద్ర కమిటీ కార్యదర్శిగా తెలుగు ప్రాంతానికి చెందిన కొండపల్లి సీతారామయ్య పని చేశారు. అనంతరం ముప్పాళ్ల లక్ష్మణ్​రావు సుదీర్ఘకాలం ఆ బాధ్యతలు నిర్వర్తించారు. అనంతరం నంబాల కేశవరావుకు ఆ బాధ్యతలు అప్పగించారు. ఆయన ఎన్​కౌంటర్​లో మృతి చెందడంతో తాజాగా తిప్పిరి తిరుపతి (Thippiri Tirupati)ని కార్యదర్శిగా నియమించారు.

Maoists | మిలటరీ ఆపరేషన్లలో దిట్ట

జగిత్యాల (Jagityal) జిల్లా కోరుట్ల పట్టణంలోని అంబేడ్కర్ నగర్​కు చెందిన తిప్పిరి తిరుపతి అలియాస్ దేవుజీ మిలటరీ ఆపరేషన్లలో దిట్ట. గతంలో ఆయన పలు కీలక బాధ్యతల్లో పనిచేశారు. ప్రస్తుతం నంబాల మృతితో ఖాళీగా ఉన్న పదవికి పలువురి పేర్లు పరిశీలనలోకి రాగా.. కేంద్ర కమిటీ తిరుపతి వైపు మొగ్గు చూపింది. ఆయన ప్రస్తుతం మిలటరీ కమిషన్​ చీఫ్​గా, పొలిట్ బ్యూరో సభ్యుడిగా కొనసాగుతున్నారు.

Maoists | కష్ట సమయంలో..

ప్రస్తుతం మావోయిస్టు పార్టీ కష్ట కాలంలో ఉంది. కేంద్ర ప్రభుత్వం 2026 మార్చి వరకు దేశంలో మావోయిస్టులు లేకుండా చేస్తామని ప్రకటించింది. ఈ మేరకు ఆపరేషన్​ కగార్​ చేపట్టింది. వేల సంఖ్యలో బలగాలు అడవులను జల్లెడ పడుతున్నాయి. నక్సల్స్​కు పట్టున్న ప్రాంతాలను సైతం బలగాలు (Security Force) ఆధీనంలోకి తీసుకున్నాయి. మరోవైపు ఎన్​కౌంటర్ల వందలాది మంది మావోలు చనిపోతున్నారు. కీలక నేతలు సైతం నేలకొరుగుతున్నారు. అలాగే ఆపరేషన్ కగార్​ ధాటికి పలువురు నక్సల్స్​ తుపాకులు వీడి పోలీసుల ఎదుట లొంగిపోతున్నారు. ఈ క్రమంలో తిప్పిరి తిరుపతి కేంద్ర కమిటీ కార్యదర్శిగా నియామకం అయ్యారు. ఎదురు దాడులు చేయాలనే ఉద్దేశంతోనే మిలటరీ ఆపరేషన్లలో పట్టు ఉన్న ఆయనకు బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం.

Maoists | లొంగిపోయిన మావోయిస్టులు

మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. అల్లూరి జిల్లా (Alluri District) ఎస్పీ ఎదుట మావోయిస్టు కీలక నేత, ఛత్తీస్​గడ్​ ఏసీఎం దేవా లొంగిపోయాడు. ఆయన 20 ఏళ్లుగా దళంలో కొనసాగుతున్నారు. ఆపరేషన్​ కగార్​ భయంతో లొంగిపోయినట్లు ఎస్పీ తెలిపారు. ఆయనపై రూ.3 లక్షల రివార్డ్ ఉందన్నారు.