అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Tirumala | తిరుమల శ్రీవారి దర్శనం చేయిస్తామంటూ భక్తులను మోసం చేసిన కేసులో పోలీసులు ఒక నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
తిరుపతి జిల్లా (Tirupati District) చంద్రగిరికి చెందిన బురిగాల అశోక్ కుమార్ రెడ్డి ‘రాక్‌స్టార్ ఈవెంట్స్’ పేరుతో నకిలీ ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థను ఏర్పాటు చేసి, రాజకీయ పరిచయాలున్నట్లు, సులభంగా వీఐపీ బ్రేక్ దర్శనం (VIP Break Darshan), కల్యాణోత్సవం, సుప్రభాత సేవ టికెట్లు, గదులు అందిస్తానని భక్తులను నమ్మించేవాడని పోలీసులు గుర్తించారు. అశోక్ కుమార్ రెడ్డి మాటలని నమ్మి భక్తులు లక్షల్లో డబ్బులు చెల్లించి మోసపోయారు.అతని మాటలు నమ్మి భక్తులు తిరుమలకు చేరుకోగా, ఆ సమయంలో అతని ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చేది.
Tirumala | కేటుగాడి మాయ..
సదరు వ్యక్తి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అందరికి దొరక్కుండా తప్పించుకు తిరిగేవాడట. తాజాగా హైదరాబాద్ (Hyderabad)లోని కొంతమంది భక్తుల దగ్గర లక్షల్లో డబ్బులు తీసుకుని మోసం చేసాడు. అతని మాటలు నమ్మి వారు తిరుమలకు చేరడంతో ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో మోసపోయామని గుర్తించి టీటీడీ విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా తిరుమల టూటౌన్ పోలీసులు అక్టోబర్ 16న కేసు నమోదు చేసి, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.పోలీసుల దర్యాప్తులో అశోక్ కుమార్ రెడ్డి బ్యాంక్ ఖాతాలో కేవలం ఒకే ఏడాదిలో కోటికి పైగా లావాదేవీలు జరిగాయని తేలింది. అమన్ గోయల్ నుంచి రూ.4,16,500 వసూలు చేయడంతో సహా, గౌతమ్ గుప్తా, రాధిక అగర్వాల్ తదితరులను మోసం చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
ఈ క్రమంలో భక్తులను అప్రమత్తం చేస్తూ పోలీసులు పలు సూచనలు చేశారు. శ్రీవారి దర్శనం, సేవా టికెట్లు, గదుల బుకింగ్ కోసం కేవలం టీటీడీ అధికారిక వెబ్‌సైట్ (TTD Website) ద్వారా మాత్రమే ప్రయత్నించవలెనని, ఎవరైనా వ్యక్తులు దర్శనం చేయిస్తామని చెప్పినా నమ్మవద్దని సూచించారు. అలాంటి దళారుల సమాచారాన్ని తిరుమల వన్‌టౌన్ (94407 96769), టూటౌన్ (94407 96772) పోలీస్ స్టేషన్లకు వెంటనే తెలియజేయమని పోలీసులు విజ్ఞప్తి చేశారు.