అక్షరటుడే, వెబ్డెస్క్ : Vinayaka Chavithi | భాద్రపద మాసంలో (Bhadrapada Masam) వచ్చే తొలి పండుగ వినాయక చవితి. ఇది విఘ్నాధిపతి అయిన గణేశుడి జన్మదినం. ఆయనకు విఘ్నాధిపత్యం లభించిన రోజు.. ఈ బుధవారం తొలి పూజలందుకునే ఆ వినాయకుడి జన్మదినం.
ఈ సందర్భంగా బొజ్జ గణపయ్యను ప్రతిష్ఠించి నవరాత్రులు పూజించడానికి ఊరూ వాడా తేడా లేకుండా ఆబాల గోపాలం ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలో వినాయక చవితి (Vinayaka Chavithi) విశిష్టత గురించి తెలుసుకుందామా..
పూర్వం పార్వతి మాత (Parvathi mata) నలుగు పిండితో బొమ్మను చేసి ప్రాణం పోసింది. తాను స్నానానికి వెళ్తూ కాపలాగా బాల గణపతిని ఉంచుతుంది. ఎవరినీ లోపలికి అనుమతించవద్దని సూచించింది. తల్లి స్నానానికి వెళ్లిన సమయంలో శివుడు (Maha Shiva) వచ్చాడు. అయితే తల్లి ఆజ్ఞ మేరకు బాల గణపతి ఆయనను అడ్డుకున్నాడు. తానెవరో చెప్పినా లోపలికి అనుమతించలేదు.
దీంతో ఆగ్రహించిన మహాశివుడు గణేశుడి తల నరికి వేశాడు. అంతలో అటుగా వచ్చిన పార్వతి దు:ఖిస్తూ తన కుమారుడిని బతికించాలని వేడుకుంది. ఆమె కోరిక మేరకు శివుడు గణపతిని బతికించడానికి చర్యలు తీసుకోగా.. బ్రహ్మ దేవుడు ఏనుగు తల తెప్పించి అతికించాడుడు. ఫలితంగా గణపతి విలక్షణ రూపంతో కనిపిస్తున్నాడు. గజాసురుడి తలను నరికి అతికించినందుకు గణేశుడు గజాననుడు (Gajanana) అయ్యాడు.
తల్లిదండ్రులైన పార్వతి, పరమేశ్వరులను ప్రత్యేక్ష దైవాలుగా పూజించే బాల గణపతికి.. భాద్రపద శుద్ధ చవితినాడే విఘ్నాధిపత్యం లభించింది. ఆ రోజు ఆయన భక్తులు సమర్పించిన రకరకాల పిండివంటలు, ఇతర తినుబండారాలు తిని భుక్తాయాసంతో చీకటిపడే వేళ కైలాసానికి చేరుకున్నాడు. అయితే భుక్తాయాసంతో తల్లిదండ్రులకు పాద నమస్కారం చేయలేక అవస్థలు పడడాన్ని చూసి చంద్రుడు నవ్వాడు. దీంతో వినాయకుడి పొట్ట పగిలి బొజ్జలోని కుడుములు బయటికి వచ్చాయి. దీనిని తట్టుకోలేక పార్వతి మాత ఆగ్రహానికి లోనై.. ‘‘నీ చూపు తగిలి తన కుమారుడి పొట్ట పగిలినందున.. నిన్ను చూసినవారు నీలాపనిందలు పొందుతారు’’ అని చంద్రుడిని శపించింది.
విషయం తెలుసుకున్న శ్రీమహావిష్ణువు (Sri Maha Vishnu) కైలాసానికి వచ్చి గణపతి బొజ్జను పాములతో కుట్టి బతికించాడు. చంద్రుడికి ఇచ్చిన శాపంతో లోకానికి ముప్పు అని చెప్పి దానిని ఉపసంహరించుకోవాలని పార్వతికి సూచించగా.. పార్వతి మాత శాంతించి, ఏనాడైతే తన కుమారుడిని చూసి చంద్రుడు నవ్వాడో.. ఆ రోజుకు శాపాన్ని పరిమితం చేసింది. ఈ నేపథ్యంలోనే భాద్రపద శుద్ధ చవితి నాడు చంద్రదర్శనం చేసుకోవద్దని పెద్దలు సూచిస్తుంటారు. ఆనాటి నుంచి ప్రజలు గణేశుడి పునర్జన్మను స్మరించుకోవడానికి, ఆనందించడానికి గణేష్ చతుర్థి పండుగను జరుపుకుంటున్నారు.
వినాయక ప్రతిమను ప్రతిష్ఠించి నవరాత్రులు పూజలు జరిపి ఆ తర్వాత ఆ విగ్రహాన్ని నిమజ్జనం చేస్తున్నారు. భూమిపై ఉన్న ప్రతిదీ చివరికి ప్రకృతిలో విలీనం అవుతుందనే వాస్తవాన్ని సూచించడానికి విగ్రహాలను నిమజ్జనం చేస్తారని ఆధ్యాత్మిక వేత్తలు పేర్కొంటున్నారు. ఇది వినాయకుడి జన్మ చక్రాన్ని సూచిస్తుందంటారు. గణనాథుడు మట్టి నుంచి జన్మించి ఆ రూపంలో భక్తులకు దర్శనమిచ్చి నిమజ్జనం తర్వాత కైలాసంలోని తల్లిదండ్రుల వద్దకు చేరుకుంటాడని పేర్కొంటారు.
