అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Tilak Varma | భారత క్రికెట్‌లో యువతరం ఆశాజ్యోతిగా ఎదుగుతున్న తిలక్ వర్మకు అనుకోని ఆరోగ్య సమస్య ఎదురవడం అభిమానులు, క్రికెట్ వర్గాలను కలవరపెట్టింది. ఆసియా కప్‌లో కీలక ఇన్నింగ్స్‌తో హీరోగా నిలిచిన ఈ హైదరాబాద్ (Hyderabad) బ్యాటర్ ఇటీవల తీవ్రమైన కడుపు నొప్పితో ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యాడు. పరిస్థితి తీవ్రంగా ఉండడంతో వైద్యులు తక్షణమే శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది.
ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉందని సమాచారం వచ్చినప్పటికీ, రాబోయే అంతర్జాతీయ సిరీస్‌లు, ముఖ్యంగా టీ20 వరల్డ్ కప్‌పై అనిశ్చితి నెలకొంది. దేశవాళీ క్రికెట్‌లో భాగంగా విజయ్ హజారే ట్రోఫీ (Vijay Hazare Trophy)లో పాల్గొంటున్న సమయంలో ఈ సమస్య తిలక్‌ను చుట్టుముట్టింది.
Tilak Varma | వరల్డ్ కప్ ముందు ఆందోళన
రాజ్‌కోట్‌లో మ్యాచ్‌కు సిద్ధమవుతున్న వేళ అకస్మాత్తుగా నొప్పి పెరగడంతో జట్టు సిబ్బంది వెంటనే ఆసుపత్రికి తరలించారు. పరీక్షల అనంతరం ‘టెస్టిక్యులర్ టోర్షన్’గా నిర్ధారణ కాగా, బీసీసీఐ (BCCI) మెడికల్ టీమ్ పర్యవేక్షణలో సర్జరీ విజయవంతంగా పూర్తయింది. జనవరి 21 నుంచి న్యూజిలాండ్‌తో ప్రారంభమయ్యే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు తిలక్ అందుబాటులో ఉండటం కష్టమనే అంచనాలు వినిపిస్తున్నాయి. గత కొంతకాలంగా టీ20 ఫార్మాట్‌లో అతని ప్రదర్శనలు జట్టుకు బలం చేకూర్చాయి. ముఖ్యంగా కీలక మ్యాచ్‌ల్లో ఒత్తిడిని తట్టుకుని ఆడగలగడం అతని ప్రత్యేకత. అలాంటి ఆటగాడు దూరమైతే టీమ్ కాంబినేషన్‌పై ప్రభావం పడటం సహజం.
ఫిబ్రవరిలో భారత్–శ్రీలంక వేదికలుగా జరగనున్న టీ20 వరల్డ్ కప్ 2026కు ఇంకా తక్కువ సమయమే ఉంది. వైద్యుల అంచనాల ప్రకారం పూర్తి కోలుకోవడానికి 3–4 వారాలు పట్టే అవకాశం ఉంది. దీంతో టోర్నీ ప్రారంభ దశలో తిలక్ బరిలోకి దిగడం కష్టమేనని సమాచారం. ఫిట్‌నెస్ తిరిగి సాధించినా, మ్యాచ్ ప్రాక్టీస్ లేకపోవడం సెలక్షన్ పరంగా సవాలుగా మారవచ్చు. తిలక్ గైర్హాజరీలో న్యూజిలాండ్ సిరీస్‌కు ఎవరిని తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. మిడిల్ ఆర్డర్‌ను బలోపేతం చేసే దిశగా సెలెక్టర్లు శ్రేయస్ అయ్యర్ (Shreyas Ayyer), రియాన్ పరాగ్ వంటి పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. కొన్ని వర్గాల్లో శుభ్‌మన్ గిల్ (Shubman Gill) పేరు కూడా చర్చకు వస్తోంది.ఇప్పటికైతే తిలక్ వర్మ త్వరగా కోలుకుని మళ్లీ మైదానంలోకి రావాలనే కోరికే అభిమానులందరికి ఉంది.