అక్షరటుడే, వెబ్‌డెస్క్ : TikTok | ఇండియాలోకి టిక్‌టాక్ పునరాగమనంపై సస్పెన్స్ కొనసాగుతోంది. షార్ట్ వీడియోస్ ప్లాట్‌ఫామ్ త్వరలోనే తనసేవలను ప్రారంభించే అవకాశం కనిపిస్తోంది. టిక్‌టాక్ (TikTok) తిరిగి వస్తుందని ఇటీవల వార్తలు రాగా, కేంద్ర ప్రభుత్వం ఖండించింది.
అయితే, తాజాగా మరోసారి టిక్‌టాక్ అంశం తెరపైకి వచ్చింది. భారత్‌లో ఉద్యోగాల భర్తీకి టిక్‌టాక్ మాతృ సంస్థ అయిన బైట్‌డ్యాన్స్ నోటిఫికేషన్ (notification) జారీ చేయడంతో సదరు మైక్రోబ్లాగింగ్ యాప్ పునరాగమనంపై మళ్లీ చర్చ ప్రారంభమైంది. గురుగ్రామ్‌లోని ఆఫీస్‌లో (Gurugram office) రెండు ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నట్టు బైట్‌డ్యాన్స్ లింక్డిన్‌లో తెలిపింది. దీంతో టిక్‌టాక్ సేవలు భారత్‌లో తిరిగి ప్రారంభం కాబోతున్నాయా? అన్నది చర్చనీయాంశమైంది.
TikTok | నిషేధించిన కేంద్రం
గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణ తర్వాత కేంద్రం చైనాకు చెందిన అనేక సైట్లు, యాప్‌లను (China sites and apps) నిషేధించింది. జాతీయ భద్రతా సమస్యలను పేర్కొంటూ ప్రభుత్వం మొదట్లో టిక్‌టాక్‌తో పాటు షేరిట్, కామ్‌స్కానర్‌తో సహా 58 ఇతర చైనీస్ యాప్‌లను బ్లాక్ చేసింది. అప్పటికే లక్షలాది మంది యూజర్ల మనస్సు దోచుకున్న టిక్‌టాక్ కేంద్ర నిషేధంతో దూరమైంది.
దాదాపు ఐదేళ్లుగా దాని సేవలు నిలిచిపోయాయి. అయితే, టిక్ టాక్ మళ్లీ వస్తుందని ఇటీవల వార్తలు వచ్చాయి. ఇటీవల, టిక్‌టాక్ వెబ్‌సైట్ పాక్షికంగా భారతదేశంలో ప్రత్యక్ష ప్రసారం అయింది. కొంతమంది వినియోగదారులకు వెబ్‌సైట్ అందుబాటులోకి వచ్చింది. ఇది తిరిగి వచ్చే అవకాశం ఉందని విస్తృతంగా ఊహాగానాలకు దారితీసింది. అయితే, కేంద్రం దాన్ని తోసిపుచ్చింది.
TikTok | చైనాతో మెరుగైన సంబంధాలు
మారుతున్న భౌగోళిక రాజకీయ పరిణామాల నేపథ్యంలో భారత్, చైనా (India and China) మధ్య సంబంధాలు మెరుగు పడుతున్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఏడేళ్ల తర్వాత చైనా పర్యటనకు వెళ్లారు. ఇరు దేశాలు స్నేహపూర్వకంగా మెలగాలని ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ నిర్ణయించుకున్నారు.
ఇరు దేశాల మధ్య తిరిగి సామరస్యం నెలకొన్న వేళ టిక్‌టాక్ కార్యకలాపాలు తిరిగి భారత్‌లో ప్రారంభం అవుతాయని చాలా మంది భావిస్తున్నారు. అందుకు తగినట్టుగానే టిక్‌టాక్ మాతృ సంస్థ అయిన బైట్‌డ్యాన్స్ తాజాగా ఉద్యోగ నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను లింక్డిన్‌లో పోస్ట్ చేసింది. ఈ నేపథ్యంలో టిక్‌టాక్ పునరాగమనంపై మళ్లీ చర్చ జోరందుకుంటోంది. అయితే, టిక్‌టాక్ ఇప్పటికీ భారతదేశంలో నిషేధం కొనసాగుతోందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.