అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy SP | జిల్లాలో మూడో విడత ఎన్నికలు శాంతియుతంగా, నిష్పక్షపాతంగా జరిగేలా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra) తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలకు మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసిన ఐదు అంచెల భద్రతా వ్యవస్థలో (five-tier security system) మొత్తం 812 మంది పోలీసు అధికారులు, సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొననున్నారని తెలిపారు.
జిల్లావ్యాప్తంగా రెండు అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులు (inter-state checkpoints), మూడు అంతర్ జిల్లా చెక్‌పోస్టులు, 25 ఎఫ్ఎస్టీ బృందాలు, ఐదు ఎస్ఎస్టీ బృందాల ద్వారా నిరంతర వాహన తనిఖీలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తుతో పాటు అదనంగా 37 రూట్ మొబైల్ పార్టీలు, ఎనిమిది స్ట్రైకింగ్ ఫోర్స్ బృందాలు, మూడు స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ బృందాలు మోహరించామని పేర్కొన్నారు. మూడో విడత ఎన్నికల్లో 10 క్రిటికల్, 9 సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలను గుర్తించడం జరిగిందన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక భద్రతా చర్యలు కట్టుదిట్టంగా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు పోలింగ్ కేంద్రాల వద్ద 163 బీఎన్ఎస్ఎస్ సెక్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు.
ఎన్నికల్లో అలజడులు సృష్టించేందుకు ప్రయత్నించినా.. సోషల్ మీడియాలో (social media) తప్పుడు, విద్వేషపూరిత ప్రచారాలు చేసినా కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఫలితాల అనంతరం విజయోత్సవ ర్యాలీలు, బాణసంచా, డీజేలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో శాంతిభద్రతలు కాపాడేందుకు పోలీసులు పకడ్బందీ చర్యలు చేపట్టారని అక్రమ కార్యకలాపాలపై కఠినంగా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. రూ.8,52,170 విలువైన 1054.54 లీటర్ల మద్యం, రూ.4.50లక్షల విలువైన 1.635 కిలోల గంజాయి, 43 గంజా మొక్కలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. అలాగే ఎన్నికల నియమావళి ఉల్లంఘనలకు సంబంధించి మొత్తం 18 కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ వెల్లడించారు.