అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : CP Sai Chaitanya | రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు (gram panchayat elections) పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సీపీ సాయి చైతన్య (CP Sai Chaitanya) తెలిపారు. రెండో విడతలో నిజామాబాద్ డివిజన్ పరిధిలో ఎన్నికలు జరగనున్నాయి.
జిల్లాలోని 8 మండలాలలో 162 గ్రామపంచాయతీలు (gram panchayats), 1,114 వార్డు స్థానాలకు రెండో విడతలో ఎన్నికలు ఆదివారం జరగనున్నాయి. ఈ క్రమంలో సీపీ మాట్లాడుతూ.. ఆయా గ్రామాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. 59 సమస్యాత్మక ప్రాంతాల్లో నిఘా ఏర్పాటు చేశామన్నారు. 31 ఎఫ్ఎస్టీ టీమ్స్ , 6 ఎస్ఎస్టీ టీమ్స్ ఏర్పాటు చేసినట్లు వివరించారు.
CP Sai Chaitanya | మద్యం స్వాధీనం
రెండో విడత ఎన్నికలు జరిగే గ్రామాలకు సంబంధించి ఇప్పటివరకు 4 కేసుల లో 166.33 లీటర్లు మద్యం సీజ్ చేసినట్లు సీపీ వెల్లడించారు. దాని విలువ రూ.97,490 ఉంటుందన్నారు. 308 మందిని తహశీల్దార్ల ఎదుట బైండోవర్ చేశామని చెప్పారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన ఒకరిపై కేసు పెట్టామని తెలిపారు. మొత్తం 11 మంది వద్ద గన్ లైసెన్లు ఉండగా.. 10 డిపాజిట్ చేశారన్నారు. మిగతా ఒక లైసెన్సు బ్యాంకుకు సంబంధించినదన్నారు.
CP Sai Chaitanya | ర్యాలీలు నిర్వహించొద్దు
రెండో విడత ఎన్నికల కోసం 1,120 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సీపీ తెలిపారు. ఫలితాల అనంతరం అనుమతి లేకుండా ఎలాంటి ర్యాలీలు నిర్వహించొద్దని ఆయన సూచించారు. మొదటి విడతలో ఇలా ర్యాలీ నిర్వహించినందుకు ఎడపల్లి మండలం ఠాణాకలాన్ గ్రామంలో ఇద్దరిపై కేసు నమోదు చేశామన్నారు.