అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : CP Sai Chaitanya | మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు (Panchayat Elections) నిజామాబాద్ జిల్లాలో పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పేర్కొన్నారు. ఈ మేరకు సీపీ సోమవారం ప్రకటన విడుదల చేశారు. శాంతియుత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు 1,384 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు.
మొదటి విడత బోధన్ డివిజన్ (Bodhan Division) పరిధిలో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారు. సబ్ డివిజన్ పరిధిలో 11 మండలాల్లో 1,084 గ్రామపంచాయతీలు 1,642 వార్డుల్లో 268 పోలింగ్ కేంద్రాల్లో 2,61,210 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో నిజామాబాద్ పోలీస్ శాఖాపరంగా ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాట్లు చేశామన్నారు.
CP Sai Chaitanya | మూడు చెక్‌పోస్టులు ఏర్పాటు..
సబ్ డివిజన్ పరిధిలోని ఎన్నికలు నిర్వహించే ప్రాంతాలలో మూడు చెక్ పోస్ట్‌లను (సాలూర, ఖండ్గావ్,పోతంగల్) ఏర్పాటు చేసినట్లు సీపీ తెలిపారు. అక్కడ పోలీసు సిబ్బంది నిర్విరామముగా నిఘావ్యవస్థ ఏర్పాటు చేసి 24 గంటల్లో వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారని చెప్పారు. ఇప్పటివరకు లిక్కర్ మొత్తం 361.46 లీటర్లు సీజ్ చేసినట్లు తెలిపారు. లిక్కర్ విలువ రూ.2,56,985 ఉంటుందన్నారు. బోధన్ డివిజన్ పరిధిలో 183మందిని బైండోవర్లు చేసి ఆయా తహశీల్దార్ల వద్ద హాజరుపర్చినట్లుచ చెప్పారు.
ఎన్నికల ప్రవర్తన నియమా నియమావళిని ఉల్లంఘించినటువంటి వారిపై మూడు కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఎడపల్లి, బోధన్ రూరల్, కోటగిరి పోలీస్ స్టేషన్లలో (Kotagiri Police Stations) కేసులు నమోదు అయ్యాయని తెలిపారు. ఈ నేపథ్యంలో సబ్ డివిజన్ పరిధిలోని మొత్తం 10 గన్ లైసెన్లు కలిగినటువంటి వారిని డిపాజిట్ చేయమని ఆదేశించగా.. ఆరుగురు మాత్రమే డిపాజిట్ చేశారన్నారు. మిగితా నాలుగు లైసెన్స్‌లు బ్యాంకులకు సంబంధించినవిగా పేర్కొన్నారు.