అక్షరటుడే, ఇందూరు: Panchayat elections | గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను జిల్లాలో పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) తెలిపారు. హైదరాబాద్ నుంచి మంగళవారం రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుమిదిని (Commissioner Rani Kumidini) వీసీ ద్వారా సమీక్ష నిర్వహించారు.
Panchayat elections | వెబ్‌కాస్టింగ్..ఓటర్ స్లిప్స్..
ఓటరు సమాచార, స్లిప్పుల పంపిణీ, నిర్వహణ, డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల ఏర్పాటు, పోస్టల్ బ్యాలెట్ (postal ballot), వెబ్ కాస్టింగ్ ఏర్పాట్లు, వసతులు, పోలీసు బందోబస్తు తదితర అంశాలపై కమిషనర్ పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్నికల కమిషన్ (Election Commission) మార్గదర్శకాల ప్రకారం పోలింగ్ నిర్వహణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామన్నారు.
Panchayat elections | మొదటి విడతలో..
తొలివిడత లో భాగంగా బోధన్, చందూర్, కోటగిరి, మోస్రా, పోతంగల్, రెంజల్, రుద్రూర్, సాలూర, వర్ని, ఎడపల్లి, నవీపేట మండలాల్లో పోలింగ్ ఉంటుందన్నారు. మొత్తం 184 సర్పంచ్, 1642 వార్డు స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయని తెలిపారు. ఇప్పటికే 27 గ్రామపంచాయతీలలో (gram panchayats) ఏకగ్రీవమయ్యాయని వెల్లడించారు. వీటిని మినహాయిస్తూ మిగతా జీపీల్లో పోలింగ్ నిర్వహణకు అన్ని విధాలుగా సమాయత్తమయ్యామని కమిషనర్ దృష్టికి తెచ్చారు.
Panchayat elections | ప్రతి పోలింగ్స్టేషన్లో..
ప్రతి పోలింగ్ స్టేషన్లో ఓటర్లకు సహకరించేలా బీఎల్వోలతో హెల్ప్ డెస్క్‌లు అందుబాటులో ఉంచుతున్నామన్నారు. 44 గంటల లైసెన్స్ పీరియడ్‌లో పాటించాల్సిన నిబంధనలు అమలయ్యేలా నిఘా బృందాలు కట్టుదిట్టమైన పర్యవేక్షణ చేస్తున్నాయని తెలిపారు. పోలింగ్ సిబ్బంది బుధవారం ఉదయం డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుంచి సామగ్రి తీసుకొని నిర్దేశిత కేంద్రాలకు బందోబస్తు మధ్య చేరుకునేలా ఏర్పాట్లు చేశామన్నారు. 31 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద గట్టి భద్రత ఏర్పాట్లు చేపడుతున్నట్లు, వెబ్ కాస్టింగ్ చేయిస్తున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, జనరల్ అబ్జర్వర్ శ్యాం ప్రసాద్ లాల్, అదనపు కలెక్టర్ అంకిత్, జడ్పీ సీఈవో సాయాగౌడ్, డీపీవో శ్రీనివాసరావు, నోడల్ అధికారులు పాల్గొన్నారు.