అక్షరటుడే, వెబ్‌డెస్క్: Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లోని బాంధవ్‌ఘర్ (Bandhavgarh) టైగర్ రిజర్వ్ పరిధిలోని ఓ గ్రామంలో పులి హల్చల్ సృష్టించింది. సోమవారం ఉదయం నుంచి గ్రామాన్ని భయభ్రాంతులకు గురిచేసిన ఈ పులి, ఒక యువకుడిపై దాడి చేయడమే కాకుండా ఏకంగా ఓ ఇంట్లోకి చొరబడి మంచంపై కూర్చుని గ్రామస్థులను వణికించింది.
దీంతో ప్రాణభయంతో గ్రామస్తులు తమ ఇళ్ల పైకప్పులపైకి ఎక్కి గంటల తరబడి బిక్కుబిక్కుమంటూ గడిపారు. సోమవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో పాన్‌పథా బఫర్ జోన్ (Panpatha Buffer Zone) నుంచి వచ్చిన ఈ పులి మొదటగా పంట పొలాల్లో దర్శనమిచ్చింది. సమాచారం అందుకున్న అటవీ శాఖ సిబ్బంది అక్కడికి చేరుకునేలోపే మధ్యాహ్నం సమయానికి పులి గ్రామంలోకి చొరబడింది.
Madhya Pradesh | దర్జాగా కూర్చుంది..
పులి (Tiger)ని చూసిన గ్రామస్థులు కర్రలతో అడవిలోకి తోలే ప్రయత్నం చేయగా, ఒక్కసారిగా అది గోపాల్ కోల్ అనే యువకుడిపైకి దాడి చేసింది. ఈ దాడిలో యువకుడి కాలికి తీవ్ర గాయాలయ్యాయి. అతడిని తొలుత బర్హీ ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమించడంతో కట్నీకి రిఫర్ చేశారు. యువకుడిపై దాడి చేసిన అనంతరం పులి దుర్గా ప్రసాద్ ద్వివేది అనే వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించింది. ఇంట్లో ఉన్న మంచంపై దర్జాగా కూర్చుని ఉండడంతో గ్రామంలో భయం రెట్టింపైంది. వెంటనే సమాచారం అందుకున్న పాన్‌పథా బఫర్ జోన్ రెస్క్యూ టీమ్, వెటర్నరీ డాక్టర్లతో కలిసి ఘటన స్థలానికి చేరుకుంది.
సుమారు ఎనిమిది గంటల పాటు తీవ్రంగా శ్రమించిన అటవీ అధికారులు (Forest Officers) చివరకు పులికి మత్తుమందు ఇచ్చి బంధించారు. అనంతరం దానిని సురక్షితంగా అడవిలోకి తరలించారు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొనగా, అటవీ శాఖ భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. మొత్తానికి కొద్ది సేపు పులి అక్కడి వారందిరిని భయబ్రాంతులకి గురి చేసింది.
Tiger strays into village near Madhya Pradesh’s Bandhavgarh Reserve, attacks man pic.twitter.com/fWuqiFFWll
— NDTV (@ndtv) December 29, 2025