అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad City | గంజాయి విక్రయిస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు ఎక్సైజ్ ఇన్‌చార్జి సూపరింటెండెంట్ (Superintendent in Charge of Excise) స్వప్న తెలిపారు. నగరంలోని అర్సపల్లి, ఎల్లమ్మ కుంట (Yellamma Gutta), అసద్‌బాబా నగర్ ప్రాంతాల్లో గంజాయి విక్రయిస్తున్నారన్న సమాచారం మేరకు దాడి జరిపినట్లు పేర్కొన్నారు.
వివిధ ప్రాంతాల్లో షేక్ పర్వేజ్, కసిలేరు మాధవ్, నజియా బేగం గంజాయి విక్రయిస్తూ పట్టుబడగా, వారి వద్ద నుంచి 1.4కేజీల ఎండు గంజాయితోపాటు రెండు బైక్‌లు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ముగ్గురిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. దాడిలో ఎస్సైలు నరసింహాచారి, రామ్‌కుమార్, హెడ్ కానిస్టేబుల్ రాజన్న, నారాయణరెడ్డి, కానిస్టేబుళ్లు భోజన్న, హమీద్, శివ సాయి, విష్ణు, అవినాష్, మంజుల ఉన్నారు.
Nizamabad City | జిల్లాలో విచ్చలవిడిగా అమ్మకాలు..
నిజామాబాద్ జిల్లాలో గంజాయి విక్రయాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. ప్రతిరోజూ ఏదోఒక చోట గంజాయి అమ్ముతూ పట్టుబడుతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడకు తీసుకువచ్చి అమ్ముతున్నారు. పోలీసులు అడపాదడపా తనిఖీలు చేస్తున్నా విచ్చలవిడిగా రవాణా సాగుతోంది. ఎక్సైజ్ పోలీసులు పూర్తిస్థాయిలో నిఘా పెట్టకపోవడం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. జిల్లా సరిహద్దు ప్రాంతమైన మహారాష్ట్ర సరిహద్దులో చెక్‌పోస్టులు ఉన్నప్పటికీ ఎలాంటి ఉపయోగం లేకుండా పోయిందని సమాచారం.
Nizamabad City | గంజాయి విక్రయిస్తూ దొరికిన బాలుడు..
తాజాగా నిజామాబాద్ నగరంలో (Nizamabad City) ఓ బాలుడు గంజాయి విక్రయిస్తూ పట్టుబడడం చర్చనీయాంశమైంది. గంజాయి ముఠా సభ్యులు చిన్నారులతో విక్రయాలు జరిపిస్తుండడం చర్చకు దారి తీసింది. అమాయకులైన బాలురకు మాయమాటలు చెప్పి.. డబ్బు ఆశచూపి ఈ ఉచ్చులోకి దింపుతున్నట్లు తెలుస్తోంది.