HomeతెలంగాణHyderabad | కల్తీ కల్లు ఘటనలో ముగ్గురు మృతి

Hyderabad | కల్తీ కల్లు ఘటనలో ముగ్గురు మృతి

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్:Hyderabad | హైదరాబాద్​లో కల్తీ కల్లు తాగి అస్వస్థతకు గురైన వారిలో ముగ్గురు మృతి చెందారు. కూకట్​పల్లి పరిధిలోని హైదర్​నగర్(Kukatpally Hydernagar)​లో మంగళవారం కల్తీ కల్లు తాగి 14 మంది అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. వారిని స్థానికులు రాందేవ్​ ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. తులసిరామ్‌ (47), బొజ్జయ్య (55), నారాయణమ్మ (65) మృతి చెందారు. మృతులంతా హెచ్‌ఎంటీ హిల్స్‌ సాయిచరణ్‌కాలనీకి చెందిన వారిగా గుర్తించారు. మరికొంత మంది కల్తీ కల్లు బాధితులు చికిత్స పొందుతున్నారు.

Hyderabad | యథేచ్ఛగా కల్తీ కల్లు విక్రయం

రాష్ట్రంలో కల్తీ కల్లు విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. గ్రామాల నుంచి మొదలు పెడితే నగరాల వరకు కల్తీ కల్లు మాఫియా(Adulterated Toddy Mafia) రెచ్చిపోతుంది. పొద్దంతా కూలీ, వ్యవసాయ పనులు చేసిన చాలా మంది రాత్రి కాగానే కల్లు తాగుతారు. ఇదే అదునుగా కొందరు కల్తీ కల్లు విక్రయాలు జరుపుతున్నారు. ప్రస్తుతం ప్రజల అవసరాలకు సరిపడా ఈత, తాటి చెట్లు లేవు. దీంతో అన్ని కల్లు బట్టిల్లో అల్ప్రాజోలం(Alprazolam) వంటి మత్తు పదార్థాలతో కల్లు తయారు చేస్తునారు. దీనిని తాగుతున్న ప్రజలు బానిసలుగా మారుతున్నారు. ఒక్కోసారి మత్తు పదార్థాల మోతాదు ఎక్కువైతే ప్రజలు అస్వస్థతకు గురవుతున్నారు. తాజాగా హైదర్​నగర్​లో ఓ వ్యక్తి చనిపోయాడు.

Hyderabad | పట్టించుకోని అధికారులు

సాధారణంగా ఈత, తాటి చెట్ల నుంచి కల్లు సేకరించాలి. అయితే పట్టణాలు, నగరాల్లో చెట్లు కనిపించడమే కష్టం. అలాంటిది ఈత, తాటి వనాలు ఎక్కడ ఉంటాయి. అయినా పట్టణాలు, నగరాల్లో కల్లు బట్టీలు ఉన్నాయి. హైదరాబాద్​(Hyderabad) నగరంలో వలస కూలీలు నివసించే ప్రాంతాల్లో ఎక్కువగా కల్లు దుకాణాలు ఉన్నాయి. ఆయా దుకాణాల్లో కల్తీ కల్లు తయారు చేస్తున్నారని జగమెరిగిన సత్యం. అయినా ఎక్సైజ్​ అధికారులు(Excise Officers) మాత్రం పట్టించుకోవడం లేదు. గతంలో కామారెడ్డి జిల్లాలోని రెండు గ్రామాల్లో సైతం కల్తీ కల్లు తాగి పలువురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

Hyderabad | బానిస అవుతున్న యువత

కల్తీ కల్లుకు యువత బానిసలుగా మారుతున్నారు. మత్తు పదార్థాలతో దీనిని తయారు చేస్తుండడంతో మొదట సరదాగా తాగుతున్న పలువురు తర్వాత బానిసలుగా మారుతున్నారు. కొంత మంది అయితే కల్లు లేకపోతే పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. మరికొందరికి ఫిట్స్​ కూడా వస్తోంది. అధికారులు స్పందించి కల్తీ కల్లు నివారణకు చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.