అక్షరటుడే, కామారెడ్డి: SP Rajesh Chandra | హైవేలపై రన్నింగ్ లారీలను టార్గెట్ చేసి కట్టర్లతో సీల్ ఓపెన్ చేసి చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠా (robbery gang) సభ్యుల్లో ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు.
జిల్లా పోలీసు కార్యాలయంలో (Police office) గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ.. గతనెల 11న 44 వ జాతీయ రహదారిపై కంటైనర్‌లో నుంచి 10 లక్షల విలువ చేసే ఫోన్లు ఎత్తుకెళ్లారు.
ఈ కేసు విచారణలో భాగంగా రెండు బృందాలను ఏర్పాటు చేసిన పోలీసులు చోరీకి పాల్పడింది మధ్యప్రదేశ్‌కు (Madya pradesh) చెందిన వారిగా గుర్తించారు. ఐదుగురు అంతర్రాష్ట్ర దొంగల ముఠా సభ్యులలో ముగ్గురిని గురువారం అరెస్ట్ చేశారు. రన్నింగ్ లారీని బైకుపై ఛేజ్ చేసి కట్టర్లతో కంటైనర్ సీల్ ఓపెన్ చేసి అందులోకి చొరబడి ఫోన్లు, హెడ్ సెట్లు ఎత్తుకెళ్లినట్టు వారు ఒప్పుకున్నట్టు ఎస్పీ తెలిపారు.
గమనించిన డ్రైవర్ కంటైనర్‌ను (Container) ఆపగా చాకుతో బెదిరించినట్లు ఎస్పీ పేర్కొన్నారు. ఐదుగురు ముఠా సభ్యులలో మధ్యప్రదేశ్‌కు చెందిన రిథిక్ జాంజ, మాల్వియా దీపక్ కుమార్, దేవీసింగ్ సిసోడియాలను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ప్రదీప్ హుడా, విమల్ సిసోడియాలు పరారీలో ఉన్నారని, వారిని పట్టుకోవడం కోసం రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు.
అరెస్ట్ అయిన వారి నుంచి ఒక బైక్, చాకు, 3 మొబైల్స్, ఒక కట్టర్ స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు. ఈ సమావేశంలో ఏఎస్పీ చైతన్య రెడ్డి, కామారెడ్డి రూరల్ సీఐ రామన్, మాచారెడ్డి, దేవునిపల్లి ఎస్సైలు అనిల్, రంజిత్ పాల్గొన్నారు.
