అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Rachakonda CP | మేడ్చల్ జిల్లా పోచారం (Pocharam)లో బుధవారం రాత్రి కాల్పులు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు రాచకొండ సీపీ సుధీర్‌బాబు (CP Sudheer Babu) తెలిపారు. ఆయన గురువారం మీడియాకు వివరాలు వెల్లడించారు.
పోచారంలో జరిగిన కాల్పుల్లో ప్రశాంత్ కుమార్ తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఇబ్రహీం అనే వ్యక్తి ఈ కాల్పులకు పాల్పడ్డాడు. ప్రస్తుతం బాధితుడు సికింద్రాబాద్ యశోద ఆస్పత్రి (Yashoda Hospital)లో చికిత్స పొందుతున్నట్లు సీపీ తెలిపారు. ప్రధాన నిందితుడు ఇబ్రహీంతో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశామన్నారు. ఇబ్రహీం ఆవులను అక్రమంగా తరలిస్తుండగా గతంలో కేసులు నమోదు అయ్యాయని సీపీ తెలిపారు. అయితే తనపై కేసులు నమోదు కావడానికి ప్రశాంత్ కారణమని కక్ష పెంచుకున్న ఇబ్రహీంపై దాడికి దిగినట్లు తెలుస్తోందన్నారు.
Rachakonda CP | ముందే పరిచయం..
ఇబ్రహీం, ప్రశాంత్ కుమార్ మధ్య ముందే పరిచయం ఉందని సీపీ తెలిపారు. శ్రీనివాస్ అనే వ్యక్తి ద్వారా మాట్లాడదామని ప్రశాంత్‌ను ఇబ్రహీం పిలిపించాడని చెప్పారు. ఈ క్రమంలో మాట మాట పెరగడంతో ఇబ్రహీం గ్యాంగ్ ప్రశాంత్ కుమార్‌పై కాల్పులు జరిపిందన్నారు. ఈ కేసులో ఇబ్రహీం కురేషి, హనీఫ్ కురేషి, కురువ శ్రీనివాస్, హస్సంబిన్ మోసిన్‌పై కేసు నమోదు చేశామని చెప్పారు. హనీఫ్ కురేషి పరారీ ఉండగా.. మిగతా ముగ్గురిని అరెస్ట్ చేశామన్నారు.
Rachakonda CP | ఆవుల రవాణాను అడ్డుకున్నందుకే..
ఇబ్రహీం గోవులను అక్రమంగా రవాణా చేస్తుండగా.. గోరక్షక్ ప్రశాంత్‌కుమార్ పలుమార్లు అడ్డుకున్నాడు. పది రోజుల్లో నాలుగు సార్లు గోవుల తరలింపును అడ్డుకోవడంతో ఇబ్రహీం శ్రీనివాస్ అనే వ్యక్తి ద్వారా ప్రశాంత్‌ను పిలిపించాడు. ఈ క్రమంలో అతడిపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనపై బీజేపీ నాయకులు, గో రక్షకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Rachakonda CP | పరామర్శించిన కేంద్రమంత్రులు
సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు ప్రశాంత్‌ను కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి (Kishan Reddy), బండి సంజయ్ (Bandi Sanjay) పరామర్శించారు. బీజేపీ చీఫ్ రాంచందర్ రావు, ఎంపీ ఈటల రాజేందర్, పలువురు బీజేపీ నేతలు ఆస్పత్రికి వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
Rachakonda CP | బీజేపీ చీఫ్ అరెస్ట్
గోరక్షకుడు ప్రశాంత్‌పై కాల్పుల ఘటనకు నిరసనగా.. డీజీపీ కార్యాలయానికి వస్తున్న తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు సహా పార్టీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. అసెంబ్లీ, లక్డీకపూల్ ప్రాంతాల్లో పలువురు నేతలను అరెస్ట్ చేశారు. గోరక్షకులపై దాడి చేసిన ఎంఐఎం నాయకుడు, అతనికి సహకరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు డిమాండ్ చేశారు. గోమాత రక్షణ కోసం కృషి చేసే వారిపై దాడి జరగడం ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ అని ఆయన అన్నారు.
