అక్షరటుడే, వెబ్‌డెస్క్ : ACB | రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల ఏసీబీ దాడులు (ACB Raids) పెరిగాయి. లంచాల పేరిట ప్రజలను పట్టి పీడిస్తున్న అధికారులపై ఏసీబీ దాడి చేసి అరెస్టులు చేస్తోంది. అయితే ఏసీబీ దాడులు పెరగడంతో ఎక్కడ తమపై దాడి చేస్తారోనని కొందరు ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. కానీ లంచాలు తీసుకోవడం మాత్రం ఆపడం లేదు. దీంతో కొంత మంది వ్యక్తులు ఏసీబీ పేరిట ఫోన్లు చేసి ప్రభుత్వ ఉద్యోగులను డబ్బులు డిమాండ్ చేస్తున్నారు.
ఏసీబీ అధికారుల పేరిట ప్రభుత్వ ఉద్యోగులకు ఇటీవల ఫోన్ కాల్స్ పెరిగాయి. తమకు డబ్బులు ఇస్తే దాడులు చేయకుండా చూస్తామని కొందరు ఫోన్లు చేస్తున్నారు. తమ అకౌంట్లో డబ్బులు జమ చేస్తే కేసులు నమోదు కాకుండా చూస్తామని చెబుతున్నారు. ఇటీవల ఇలాంటి ఘటనలు పెరిగాయి. ఇలాగే బెదిరింపులకు పాల్పడిన ఘటనలో మంగళవారం హైదరాబాద్ (Hyderabad) నగరంలోని అబిడ్స్ (Abids)లో కేసు నమోదు అయింది.
ACB | మోసపోతున్న ఉద్యోగులు
ఏసీబీ దాడులు, అరెస్టులు పెరగడంతో కొంతమంది అవినీతి అధికారుల్లో భయం పెరిగింది. దీంతో ఏసీబీ పేరిట ఫోన్లు రాగానే భయపడిపోతున్నారు. ఎక్కడ తమ బండారం బయట పడుతుందోనని నకిలీ ఏసీబీ అధికారులకు డబ్బులు చెల్లిస్తున్నారు. తర్వాత మోసపోయామని తెలిసినా.. కేసులు పెడితే పరువు పోతుందని సైలెంట్‌గా ఉండిపోతున్నారు. అయితే లంచాలు తీసుకొని అధికారులకు సైతం బెదిరింపు కాల్స్ వస్తున్నారు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఖమ్మం (Khammam) జిల్లా టేకులపల్లి పోలీస్ స్టేషన్లో మే నెలలో నకిలీ ఏసీబీ అధికారిపై కేసు నమోదైంది.
ACB | డబ్బులు ఇవ్వొద్దు
ఏసీబీ పేరిట ఉద్యోగులకు ఎవరైనా ఫోన్ చేస్తే డబ్బులు ఇవ్వొద్దని ఏసీబీ అధికారులు సూచించారు. దాడులు, కేసుల పేరుతో ఏసీబీ అధికారులు డబ్బులు డిమాండ్ చేయరని స్పష్టం చేశారు. అలా ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే వెంటనే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064కు ఫోన్ చేయాలని సూచిస్తున్నారు. అలాగే స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలన్నారు. నకిలీ ఫోన్ కాల్స్ నమ్మి మోసపోవద్దని సూచించారు.