అక్షరటుడే, వెబ్‌డెస్క్ : CM Revanth Reddy | కాంగ్రెస్ హయాంలోనే హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందిందని సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల (Jubilee Hills by-election) నేపథ్యంలో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ను గెలిపించాలని కోరారు.
ఔటర్ రింగ్ రోడ్డు, శంషాబాద్ విమానాశ్రయం, మెట్రో రైలు కాంగ్రెస్ హయాంలోనే తెచ్చినట్లు సీఎం తెలిపారు. 2014 నుంచి కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలో పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ నగరానికి చేసింది ఏమి లేదన్నారు. వరదల్లో హైదరాబాద్ (Hyderabad) మునిగిపోతే కేంద్రం నుంచి కిషన్‌రెడ్డి చిల్లి గవ్వ తీసుకురాలేదని విమర్శించారు. కాళేశ్వరం కట్టడం, కూలడం మూడేళ్లలోనే జరిగిపోయిందన్నారు. రూ.లక్ష కోట్లు గోదావరిలో పోశారని ఆయన ఆరోపించారు. జూబ్లీహిల్స్ ప్రజలు విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయాలని కోరారు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలోనే హైదరాబాద్ గ్రోత్ ఇంజిన్‌గా మారిందన్నారు.
CM Revanth Reddy | అండగా ఉండండి
తనకు పదేళ్లు అండగా ఉంటే.. తెలంగాణను అభివృద్ధి చేసి చూపిస్తానని సీఎం అన్నారు. గంజాయి, డ్రగ్స్ వాడితే తొక్కి నార తీస్తాననని హెచ్చరించారు. చెరువులు ఆక్రమించినవారిలో ఎంత పెద్దవాళ్లు ఉన్నా.. చర్యలు తప్పవన్నారు. పేదలు ఉంటే అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR), కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి (Union Minister Kishan Reddy) హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపించారు. వీరిద్దరని బ్యాడ్ బ్రదర్స్‌గా అభివర్ణించారు. మెట్రో విస్తరణ, మూసీ ప్రక్షాళన, రీజినల్ రింగ్ రోడ్డు, ఫ్యూచర్‌సిటీని వీరు అడ్డుకుంటున్నారని ఆరోపించారు.
CM Revanth Reddy | నగర అభివృద్ధికి చర్యలు
కాంగ్రెస్ (Congress) అధికారంలోకి వచ్చాక నగర అభివృద్ధికి చర్యలు చేపట్టామన్నారు. ఏళ్ల నుంచి పెండింగ్‌లో ఉన్న కంటోన్మెంట్ నుంచి శామీర్‌పేట, మేడ్చల్‌కు ఎలివేటెడ్ కారిడార్లకు అనమతులు తెచ్చామన్నారు. రూ.5వేల కోట్లతో పనులు ప్రారంభించామని చెప్పారు. గతంలో జనార్దన్‌రెడ్డి, శశిధర్‌రెడ్డి హైదరాబాద్ అభివృద్ధి కోసం అనేక ప్రయత్నాలు చేశారన్నారు. వీరిని హైదరాబాద్ బ్రదర్స్ అనే వాళ్లని రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు. ప్రస్తుతం కేటీఆర్, కిషన్‌రెడ్డిని బ్యాడ్ బ్రదర్స్ అంటున్నారని చెప్పారు. కిషన్‌రెడ్డి కేసీఆర్, కేటీఆర్‌కు లొంగిపోయారని విమర్శించారు.
