అక్షరటుడే, వెబ్డెస్క్ : Jagga Reddy | టీపీసీసీ (TPCC) వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్ (BRS) అధికారంలోకి రాలేదని జగ్గారెడ్డి అన్నారు. మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వమే వస్తుందని చెప్పారు. తన రివ్యూలకు వచ్చే అధికారులు భయపడాల్సిన పని లేదన్నారు. మూడేళ్ల దాకా వారిని ఎవరు ముట్టుకోరని కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో జగ్గారెడ్డి ఓడిపోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన ప్రజాప్రతినిధిగా లేరు. అయినా కూడా అధికారులతో రివ్యూలు నిర్వహిస్తూ.. ఆదేశాలు జారీ చేస్తున్నారు. దీనిపై ఇటీవల విమర్శలు రాగా.. ఆయన పైవిధంగా స్పందించారు. సమీక్షలకు హాజరయ్యే వారిని ఉన్నతాధికారులు ఏమైనా అంటే తన పేరు చెప్పాలని సూచించారు.
Jagga Reddy | కులం పేరు చెప్పుకొని రాలేదు
తాను కులం పేరు చెప్పుకొని రాజకీయాల్లోకి రాలేదని జగ్గారెడ్డి అన్నారు. ప్రజల మధ్య నుంచి వచ్చానని చెప్పారు. గెలుపోటములు తనను ప్రభావితం చేయలేవని స్పష్టం చేశారు. తన రాజకీయ ప్రయాణం కష్టాలతో కూడుకున్నదని, రాత్రుళ్లు జెండాలు కట్టి, పగటి పూట ధర్నాలు చేసి ఎదిగిన చరిత్ర తనదని చెప్పుకొచ్చారు.
Jagga Reddy | ఎంతో తేడా..
పరిపాలనలో కాంగ్రెస్, బీఆర్ఎస్కు మధ్య ఎంతో తేడా ఉందని ఆయన అన్నారు. బీఆర్ఎస్ నేతలు సచివాలయానికి రాకుండా.. ఇళ్ల నుంచే పరిపాలన చేశారని జగ్గారెడ్డి విమర్శించారు. సదాశివపేట (Sadashivapet)లో రోడ్డు పనులకు 2014లో రూ.20 కోట్లు మంజూరు చేయించానన్నారు. పనులు ఇంకా కొనసాగుతున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.