అక్షరటుడే, వెబ్‌డెస్క్:Ecommerce | గుండుపిన్ను నుంచి భారీ వస్తువుల వరకు ఈ కామర్స్(ecommerce) ఫ్లాట్‌ఫాంలలో అమ్ముతున్నారు. ఎలక్ట్రానిక్ ఉత్పత్తులే కాదు.. నిత్యావసర సరుకులూ విక్రయిస్తున్నారు.
ఆన్‌లైన్(Online)లో పిడకలు, మామిడి ఆకులు కూడా లభిస్తున్నాయి. అయితే కొన్ని వస్తువులపై మాత్రం నిషేధం ఉంటుంది. వాటిని విక్రయించడానికి వీలులేదు. తాజాగా కీలకమైన కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లకు అంతరాయం కలిగించే వైర్‌లెస్ (Wireless) పరికరాల అనధికార అమ్మకాలను అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
ఇందులో భాగంగా ఈకామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో వాకీ టాకీ(Walkie talkie)లు సహా రేడియో పరికరాల అమ్మకాల నివారణ కోసం సెంట్రల్ కన్జూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA) మార్గదర్శకాలను జారీ చేసింది. దీంతో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మీషో, జియోమార్ట్ వంటి ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు వాకీటాకీల విక్రయాలను నిలిపేశాయి. ఆయా సంస్థలు తమ విక్రయ వస్తువుల జాబితా నుంచి వాకీటాకీలను తొలగించాయి.
టెలికమ్యూనికేషన్స్ విభాగం (DoT), హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MHA) లతో విస్తృతమైన సంప్రదింపుల తర్వాత ఈ మార్గదర్శకాలను రూపొందించినట్లు సీసీపీఏ పీఐబీ ప్రకటనలో పేర్కొంది. చట్టాలకు అనుగుణంగా ఉన్నట్లు లేదా లైసెన్సింగ్ వివరాలు లేకుండానే చాలా సంస్థలు ఆన్‌లైన్‌లో వాకీటాకీలను విక్రయిస్తున్నట్లు గుర్తించామని సెంట్రల్ కన్జూమర్ ప్రొటెక్షన్ అథారిటీ ఒక ప్రకటనలో తెలిపింది.
ఆయా సంస్థలు వాకీటాకీల ఫ్రీక్వెన్సీ రేంజ్ (walkie-talkie Frequency range), వాటి వినియోగానికి లైసెన్స్ అవసరమా అన్న వివరాలను పేర్కొనకుండా ఆయా పరికరాలను స్వేచ్ఛగా ఉపయోగించవచ్చని వినియోగదారులను తప్పుదోవ పట్టిస్తున్నాయని గుర్తించి తాజా మార్గదర్శకాలు జారీ చేసినట్లు పేర్కొంది.