అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Hero Moto Corp | భారత్‌కు చెందిన హీరో మోటో కార్ప్ ప్రపంచంలోని అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీదారుల్లో ఒకటిగా నిలుస్తోంది. ఈ కంపెనీ ఇటీవలే యూకేలో (UK) తన కార్యకలాపాలను ప్రారంభించింది.
తద్వారా 51 దేశాలలో కార్యకలాపాలను నిర్వహిస్తున్న సంస్థగా ఎదిగింది. హీరో మోటో కార్ప్ (Hero Moto Corp) కంపెనీ ప్రస్తుతం ఆసియా (Asia), ఆఫ్రికా, యూరప్, లాటిన్ అమెరికాలోని 51 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తూ 125 మిలియన్లకుపైగా వినియోగదారులకు సేవలు అందిస్తోంది. యూకేకు చెందిన మోటోజీబీ (MotoGB) భాగస్వామ్యంతో యూరో 5 ప్లస్ శ్రేణి ద్వారా యునైటెడ్ కింగ్‌డమ్‌లో హంక్ (Hunk) 440 మోటార్ సైకిల్‌ను ప్రవేశపెట్టింది. ఈ బైక్‌ను హార్లే డేవిడ్‌సన్ సహకారంతో అభివృద్ధి చేసింది. ఇందులో 440 సీసీ ఇంజిన్ ఉంది. ఇది 4000 ఆర్‌పీఎం (RPM) వద్ద 36 ఎన్‌ఎం టార్క్‌ను, 6000 ఆర్‌పీఎం వద్ద 27 బీహెచ్‌పీ గరిష్ట శక్తిని ఉత్పత్తి చేస్తుంది. డ్యుయల్ చానల్ ఏబీఎస్, కేవైబీ ద్వారా యూఎస్‌డీ కార్ట్రిడ్జ్ ఫోర్క్స్, పూర్తి డిజిటల్ టీఎఫ్‌టీ డిస్‌ప్లే, ఆల్ ఎల్‌ఈడీ లైటింగ్ అమర్చబడిన హంక్ 440 ప్రీమియం రైడింగ్ అనుభూతిని ఇస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ మోడల్ ట్విలైట్ బ్లూ, ఫాంటమ్ బ్లాక్, టైటానియం గ్రే అనే రంగుల్లో అందుబాటులో ఉంది. దీని ధర 3,499 పౌండ్లు (సుమారు రూ. 4.08 లక్షలు).
