అక్షరటుడే, వెబ్‌డెస్క్:Reliance | భారీ అంచనాలతో స్టాక్ మార్కెట్(Stock market)లో లిస్టయి, ఆ అంచనాలు తారుమారై ఇన్వెస్టర్ల సంపదను హరించిన అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ పవర్(Reliance power)కు ఎట్టకేలకు టైమొచ్చింది. నాలుగేళ్లుగా పనితీరును మెరుగుపరచుకుంటూ.. తిరిగి స్టాక్ ధర పెరుగుతోంది. ఇటీవల నెల రోజుల్లో 61 శాతం పెరగడం గమనార్హం.
రిలయన్స్ పవర్ 2008 సంవత్సరంలో ఐపీవో(IPO)కు వచ్చింది. ఇన్వెస్టర్ల నుంచి రూ.11,563 కోట్లు సమీకరించడం కోసం ఆ ఏడాది జనవరి 15 నుంచి 18 వరకు బిడ్లను స్వీకరించింది. ఇష్యూ ప్రైస్(Issue price) ఒక్కో షేరుకు రూ.450. ఫిబ్రవరి 11న బీఎస్‌ఈతో పాటు ఎన్‌ఎస్‌ఈలలో లిస్టయ్యింది. భారీ అంచనాలతో వచ్చిన ఈ కంపెనీ లిస్టింగ్ రోజు తుస్సుమనిపించింది. 17.27 శాతం డిస్కౌంట్(Discount)తో రూ.372 వద్ద లిస్టయ్యింది. అంటే ఇన్వెస్టర్లకు తొలిరోజే ఒక్కో షేరుపై రూ. 78 నష్టాన్ని మిగిల్చింది. ఆ తర్వాత కూడా పతనం కొనసాగింది. అదే ఏడాది 3 : 5 రేషియోలో బోనస్ (Bonus) ఇవ్వడంతో షేర్ ప్రైస్ కొంత కోలుకున్నట్లు కనిపించినా ఆ తర్వాత మళ్లీ క్షీణించింది. 2020 వరకు పతనం కొనసాగింది. 2020 మార్చిలో షేరు ప్రైస్(Share price) రూ.1.25కి పడిపోయింది.
Reliance | పడిలేచిన కెరటంలా..
ఇక అనిల్ అంబానీ(Anil ambani company) పని అయిపోయినట్లే అనుకుంటున్న తరుణంలో పడి లేచిన కెరటంలా స్టాక్ ధర పెరగడం ప్రారంభించింది. రెండేళ్లలోనే డబుల్ డిజిట్‌కు చేరింది. 2023 నుంచి స్టాక్ ప్రైస్ పరుగులు తీస్తోంది. గతనెల రోజుల్లోనే 61 శాతం పెరిగింది. మే 6వ తేదీన స్టాక్ ధర రూ.38.25 ఉండగా.. ప్రస్తుతం రూ.61.80 పైన ట్రేడ్(Trade) అవుతోంది. ఈ స్టాక్ 52 వారాల కనిష్ట ధర రూ.23.30 కాగా.. 52 వారాల గరిష్ట ధర రూ.62.80.
Reliance | మెరుగుపడిన పనితీరు..
ఇటీవలి కాలంలో రిలయన్స్ పవర్ (Reliance Power) కంపెనీ పనితీరు మెరుగుపడుతోంది. విద్యుత్ రంగంలో డిమాండ్ పెరగడానికి తోడు ప్రభుత్వం అమలు చేస్తున్న సంస్కరణలు, పాలసీలు ఈ కంపెనీకి జవజీవాలను అందించాయి. అనిల్ అంబానీ నేతృత్వంలోని ఈ కంపెనీ కొత్త ప్రాజెక్టులతో పాటు భాగస్వామ్యాలపై దృష్టి సారించింది. రుణభారాన్ని తగ్గించుకుంది. ఆస్తుల విక్రయం ద్వారా దాదాపు అప్పుల ఊబినుంచి బయటపడడం ఇన్వెస్టర్లలో విశ్వాసాన్ని పెంచింది. ఇదే సమయంలో కంపెనీ ప్రకటిస్తున్న రిజల్ట్స్ కూడా మెరుగ్గా ఉంటున్నాయి. దీంతో స్టాక్ విలువ పెరుగుతోంది.