అక్షరటుడే, వెబ్‌డెస్క్: Nizamabad DEO | అశోక చక్రవర్తి (Ashoka Chakravarthy) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయనకంటూ చరిత్రలో ఓ ప్రత్యేక స్థానం ఉంది. అయితే జిల్లా విద్యాశాఖలోనూ (District Education Department) తనకు తాను ఓ అధికారి అశోక వర్తిని అనుకుంటున్నారు. కానీ ఆయన తీరు మాత్రం చరిత్ర చెప్పే చక్రవర్తికి పూర్తి విరుద్ధం.
జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ వ్యవహరిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. తానేమీ తప్పుచేయనంటూనే.. తప్పు చేస్తున్న వారికి ప్రత్యక్షంగా సహకరిస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డికి (Nizamabad Rural MLA Bhupathi Reddy) అనధికారికంగా పీఏగా వ్యవహరిస్తున్న శ్రీనివాస్ రెడ్డి వ్యవహారంలో డీఈవో మొదటి నుంచి వ్యవహరిస్తున్న శైలి పలు అనుమానాలకు తావిస్తోంది.
ఎమ్మెల్యే భూపతిరెడ్డి ఒత్తిడికి తలొగ్గిన డీఈవో శ్రీనివాస్ రెడ్డిపై చర్యలు తీసుకునేందుకు వెనుకడుగు వేస్తున్నారు. ఏళ్లుగా బడికి మొహం చాటేసిన టీచర్ పట్ల కఠినంగా వ్యవహరించాల్సిన డీఈవో అశోక్ తనకేమీ తెలియదన్నట్లుగా వ్యవహరించి చిక్కుల్లోపడ్డారు.
పైపెచ్చు మొక్కుబడిగా షోకాజ్ నోటీసు జారీ చేసి ఎలాంటి చర్యలు తీసుకోకుండా వదిలేయడం. మరోవైపు శ్రీనివాస్ రెడ్డి ఇప్పటికీ ఎమ్మెల్యే పీఏగా (MLA PA) కార్యాలయంలో నేరుగా కార్యకలాపాలు సాగిస్తుండడంపై సర్వత్రా చర్చకు దారి తీసింది. మామూలు టీచర్ల విషయంలో ఉరుకుపరుగుల మీద చర్యలు తీసుకునే అధికారులు రాజకీయ అండదండలు కలిగిన వారిపట్ల కళ్లు మూసుకున్నట్లు వ్యవహరించడం ఉపాధ్యాయుల్లోనూ చర్చకు తెరలేపింది.
Nizamabad DEO | కొరవడిన సమన్వయం
జిల్లా విద్యాశాఖాధికారిగా అశోక్ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి కార్యాలయంలోనూ అధికారులు, సిబ్బందితో సమన్వయం కొరవడింది. ప్రత్యేకించి అన్ని విషయాల్లో అనుమానాలు వ్యక్తపర్చడం.. నీతినిజాయితీ అంటూ ఊదరగొట్టడం ఇందుకు కారణం.
అలా అని అన్ని విషయాల్లోనూ పక్కాగా వ్యవహరించడం లేదు. కొందరు ఎమ్మెల్యేలు ఫోన్ చేస్తే ఎలాంటి పని అయినా క్షణాల్లో చేసిపెడుతున్నట్లు సమాచారం.
నిబంధనలకు విరుద్దంగా పలు నిర్ణయాలు తీసుకున్నారు. దీంతో సొంత శాఖలో డీఈవో ద్వంద్వ వైఖరిపై సొంత కార్యాలయంలోనే అసమ్మతి గళం వినిపించడానికి కారణమైంది. ఒక్కమాటలో డీఈవో ఒకవైపు, మిగతా అధికారులు, సిబ్బంది (officers and staff) మరోవైపు ఉన్నట్లు పరిస్థితి మారిపోయింది.
Nizamabad DEO | సంఘాలనూ లెక్కచేయరు..
విద్యాశాఖలో ఉపాధ్యాయ సంఘాలది అత్యంత కీలకపాత్ర. విద్యాశాఖ తీసుకునే నిర్ణయాలను బడుల స్థాయిలో పక్కాగా అమలు చేయించడంలో సంఘాల బాధ్యులు క్రీయాశీలకంగా వ్యవహరిస్తేనే అంతా సక్రమంగా జరుగుతుంది.
కానీ ప్రస్తుత డీఈవో అశోక్ జిల్లాలోని ఏ ఉపాధ్యాయ సంఘంతో కూడా సఖ్యతతో లేకపోవడం గమనార్హం. దీంతో ఆయా సంఘాల నాయకులు సైతం డీఈవో వ్యవహరిస్తున్న తీరుపై ఇప్పటికే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
Nizamabad DEO | అసంతృప్తితో ప్రైవేటు విద్యాసంస్థలు
జిల్లాలోని ప్రైవేటు విద్యా సంస్థలు సైతం డీఈవో తీరుపై అసంతృప్తితో ఉన్నాయి. ప్రత్యేకించి దశాబ్దాలుగా కొనసాగుతున్న బడుల పర్మిషన్స్ రెన్యువల్ విషయంలో డీఈవో అశోక్ వ్యవహరించిన తీరు తీవ్ర విమర్శలకు తావిచ్చింది.
ఏళ్లుగా నడుస్తున్న స్కూళ్లకు యాథావిధిగా రెన్యువల్ పర్మిషన్స్ ఇవ్వకుండా కొత్తగా కొర్రీలు పెట్టిన ఘనత ఈయనకే దక్కింది. మరోవైపు కొత్తగా పుట్టుకొచ్చి బడులు సరైన నిబంధనలు పాటించకపోయినప్పటికీ ఎమ్మెల్యేలు ఫోన్ చేశారంటూ హడావుడిగా పని పూర్తి చేసిపెట్టడం కూడా ఈయనకే దక్కింది.
మొత్తంగా అటు ప్రభుత్వ, ఇటు ప్రైవేటు బడులపై సర్వాధికారాలు కలిగిన జిల్లా విద్యాశాఖాధికారి (District Education Officer) వ్యవహరిస్తున్న తీరు మరో రకం అశోక చక్రవర్తిగా అనిపిస్తోందని పలువురు చర్చించుకుంటున్నారు.
