అక్షరటుడే, వెబ్‌డెస్క్ :Fake Police Station | నకిలీ టోల్ ప్లాజా, నకిలీ బ్యాంకులు ఏర్పాటు చేసి కొందరు కేటుగాళ్లు గతంలో ప్రజలను మోసం చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఓ వ్యక్తి ఏకంగా పోలీస్ స్టేషన్(Fake Police Station) పెట్టేశాడు. అంతేకాదు ఏడాది పాటు యథేచ్ఛగా దందాలు నడిపాడు. అయినా అధికారులు కనిపెట్టలేకపోయారంటే అర్థం చేసుకోవచ్చు.
Fake Police Station | ఉద్యోగాల పేరిట వసూళ్లు
బీహార్(Bihar)లోని పూర్ణియా జిల్లా మోహని గ్రామంలో రాహుల్ కుమార్ షా అనే వ్యక్తి నకిలీ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేశాడు. పోలీస్ స్టేషన్లో ఉద్యోగాలు ఇస్తానని చెప్పి యువత నుంచి వసూళ్లకు పాల్పడ్డాడు. గ్రామీణ రక్షాదళ్ రిక్రూట్‌మెంట్(Grameena Rakshanadal Recruitment) పేరుతో కానిస్టేబుల్, చౌకీదార్‌ల నియామకాలు కూడా చేపట్టాడు సదరు వ్యక్తి. దీని కోసం వారి నుంచి రూ.25 వేల నుంచి 50 వేల రూపాయల వరకు వసూలు చేశారు. వారిని ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నట్లు రాహుల్ కుమార్ షా వెల్లడించాడు. అనంతరం వారికి పోలీస్ యూనిఫామ్లు లాఠీలు, నకిలీ ఐడీ కార్డులు సైతం అందజేశాడు.
Fake Police Station | దాడులు చేస్తూ అక్రమార్జన
ఫేక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసి రాహుల్ అందులో నకిలీ పోలీసు(Fake Police)లతో పెట్రోలింగ్ కూడా నిర్వహించాడు. అక్రమంగా మద్యం రవాణా చేసే వారిపై వీరు దాడులు చేసేవారు. ఈ సందర్భంగా వారి నుంచి వసూళ్లకు పాల్పడేవాడు. అందులో సగాన్ని తాను తీసుకొని, మిగతా సగం తన దగ్గర పని చేసేవారికి ఇచ్చేవాడు. సుమారు ఏడాది పాటు ఇలా నకిలీ పోలీస్ స్టేషన్ నిర్వహించాడు. తాజాగా అతడి బాగోతం బయట పడటంతో పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో రాహుల్ పరారయ్యాడు. అతడి కోసం ముమ్మరంగా గాలిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.