అక్షరటుడే, వెబ్‌డెస్క్: Fake Embassy | నకిలీ సంస్థలు పెట్టి ప్రజలను మోసం చేయడం చూస్తుంటాం. గతంలో నకిలీ బ్యాంకులు, పోలీస్ స్టేషన్లు, టోల్ ప్లాజాలు పెట్టి ప్రజలను మోసం చేసిన ఘటనలు దేశంలో వెలుగు చూశాయి. కానీ ఈ వ్యక్తి మాత్రం ఏకంగా నకిలీ రాయబార కార్యాలయాన్ని (Fake Embassy) ఏర్పాటు చేశాడు. అసలు ప్రపంచంలో లేని దేశాలకు తాను రాయబారిని అని నమ్మించాడు. ఈ కార్యాలయం ద్వారా పలు ఆర్థిక అక్రమాలకు ఆయన పాల్పడ్డాడు.
ఉత్తరప్రదేశ్‌లోని (Uttar Pradesh) నోయిడా పోలీసులు ఘాజియాబాద్‌లో నిర్వహిస్తున్న నకిలీ రాయబార కార్యాలయంపై బుధవారం దాడులు చేశారు. హర్షవర్ధన్ జైన్ అనే వ్యక్తి కవినగర్‌లో ఇల్లు అద్దెకు తీసుకొని వెస్ట్ ఆర్కిటిక్, సబోర్గా, పౌల్వియా, లోడోనియా వంటి దేశాలకు అంబాసిడర్‌గా అని చెప్పుకున్నాడు. పోలీసులు (Noida Police) ఆ ఇంటిపై దాడి చేసి నిందితుడు హర్షవర్ధన్‌ను అదుపులోకి తీసుకున్నారు.
Fake Embassy | దౌత్య నంబర్ ప్లేట్లతో లగ్జరీ కార్లు
హర్షవర్ధన్ తాను దౌత్యవేత్తను అని నమ్మించడానికి నకిలీ దౌత్య ప్లేట్లతో ఉన్న నాలుగు లగ్జరీ కార్లను (Luxury Cars) వినియోగిస్తున్నాడు. 18 నకిలీ నంబర్ ప్లేట్లను STF అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అంతేగాకుండా హర్షవర్ధన్ ప్రధానమంత్రి, రాష్ట్రపతి, ఇతర ప్రముఖులతో తాను ఉన్నట్లుగా ఫొటోలు సృష్టించి ప్రజలను నమ్మించాడు.
Fake Embassy | భారీగా నగదు స్వాధీనం
హర్షవర్ధన్ నకిలీ కార్యాలయంలో సోదాలు చేసిన అధికారులు మైక్రో నేషన్ దేశాల 12 దౌత్య పాస్‌పోర్ట్‌లు, విదేశాంగ మంత్రిత్వ శాఖ ముద్రతో నకిలీ పత్రాలు (Fake Documents), రెండు నకిలీ పాన్ కార్డులు (Fake Pancards), వివిధ దేశాలు, కంపెనీల 34 స్టాంపులు, రెండు నకిలీ ప్రెస్ కార్డులు (Fake Press Cards). రూ. 44 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. అనేక కంపెనీల పత్రాలు, భారీగా విదేశీ కరెన్సీ స్వాధీనం సీజ్ చేశారు.
Fake Embassy | ఆర్థిక అక్రమాల కోసం..
నకిలీ రాయబార కార్యాలయం ద్వారా హర్షవర్దన్ ఆర్థిక అక్రమాలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. అక్రమ కార్యకలాపాలను నిర్వహించడానికి విదేశీ దౌత్యవేత్తగా నటించాడన్నారు. హవాలా, షెల్ కంపెనీల ద్వారా లావాదేవీలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. విదేశీ నియామకాల తప్పుడు వాగ్ధానంతో కంపెనీలు, వ్యక్తుల కోసం హవాలా కార్యకలాపాలు, బ్రోకరింగ్ ఒప్పందాలలో పాలుపంచుకున్నట్లు తెలిపారు.