అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | పట్టణంలో దొంగలు హల్చల్ సృష్టిస్తున్నారు. తాళంవేసిన ఇళ్లను టార్గెట్ చేస్తూ చోరీలకు పాల్పడుతున్నారు. తాజాగా శుక్రవారం పట్టణంలోని స్నేహపురి కాలనీలో (Snehapuri Colony) తాళం వేసి ఉన్న మూడిళ్లలో ఒకే రోజు చోరీకి పాల్పడ్డారు.
అర్ధరాత్రిలో కాలనీలోకి ప్రవేశించిన దొంగలు.. మూడు ఇళ్లలో 2 తులాల బంగారం, 30 తులాల వెండి, రూ.50 వేల నగదు ఎత్తుకెళ్లారు. అయితే బాధితుల వివరాలు మాత్రం పోలీసులు (Kamareddy police) వెల్లడించడం లేదు. మరోవైపు చోరీకి పాల్పడుతున్నారంటూ కొందరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సీసీ ఫుటేజీలో చోరీకి పాల్పడిన దొంగల దృశ్యాలు రికార్డయినట్లుగా తెలుస్తోంది.
శనివారం ఉదయం కొన్ని సామాజిక మాద్యమాల్లో (social media) సీసీ ఫుటేజీల్లో చోరీకి పాల్పడినట్లుగా ఫొటో చక్కర్లు కొడుతోంది. ముగ్గురు వ్యక్తులు ఈనెల 22న తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో సంచరించినట్టుగా ఓ ఇంటికి సంబంధించిన సీసీ ఫుటేజీల్లో (CCTV footage) రికార్డు అయినట్లుగా తెలుస్తోంది. ముగ్గురు వ్యక్తులు తలకు క్యాప్ ధరించి ముఖాలు కనిపించకుండా కర్చీఫ్ కట్టుకున్నట్టుగా కనిపించింది. దాంతో పట్టణ ప్రజలు భయాందోళనకు గురువుతున్నారు. ఇళ్లకు తాళంవేసి ఊళ్లకు వెళ్లాలంటే జంకుతున్నారు. పోలీసులు త్వరగా దొంగలను పట్టుకోవాలని కాలనీవాసులు కోరుతున్నారు.