అక్షరటుడే, వెబ్‌డెస్క్: Chain Snatching | దేశవ్యాప్తంగా చైన్ స్నాచర్లు (Chain Snatchers) రెచ్చిపోతున్నారు. మహిళలు ఒంటరిగా కనిపిస్తే చాలు.. బైక్‌పై వచ్చి మెడలోని బంగారు ఆభరణాలను లాక్కెళ్తున్నారు. ఇలాంటి ఘటనలు ఇటీవల బాగా పెరిగాయి. కొంత మంది యువత జల్సాలకు అలవాటు పడి డబ్బుల కోసం చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్నారు. పోలీసులు ఎంతో మందిని అరెస్ట్ చేస్తున్నా.. గొలుసు దొంగతనాలు మాత్రం ఆగడం లేదు. తాజాగా ఓ దొంగ ఏకంగా ఎంపీ మెడలో నుంచే చైన్ లాక్కెళ్లాడు.
ఢిల్లీలో మార్నింగ్ వాకింగ్ చేస్తున్న సమయంలో తన బంగారు గొలుసును లాక్కెళ్లారని కాంగ్రెస్ ఎంపీ సుధా రామకృష్ణన్ (Congress MP Sudha Ramakrishnan) సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమిళనాడులోని మైలదుత్తురై ఎంపీ అయిన రామకృష్ణన్ ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఢిల్లీలో ఉన్నారు. ఈ క్రమంలో సోమవారం మార్నింగ్ వాక్కు (Morning Walk) వెళ్లిన సమయంలో ఆమె చైన్‌ను దొంగలు లాక్కొని పారిపోయారు. దీంతో ఎంపీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హెల్మెట్ ధరించి బైక్‌పై వచ్చిన వ్యక్తి తన చైన్ లాక్కొని పారిపోయాడని చెప్పారు. ఆ సమయంలో తనతో పాటు డీఎంకేకు చెందిన ఎంపీ రాజతి (MP Rajathi) ఉన్నట్లు తెలిపారు.
Chain Snatching | మెడపై గాయాలు
తాము వాకింగ్ చేస్తుండగా.. ఎదురుగా బైక్‌పై వచ్చిన వ్యక్తి చైన్ లాక్కొని పారిపోయాడని ఎంపీ సుధా రామకృష్ణన్ తెలిపారు. సదరు వ్యక్తి గొలుసును గట్టిగా లాగడంతో మెడపై గాయాలు అయినట్లు చెప్పారు. అనంతరం ఢిల్లీ పోలీసులకు (Delhi Police) ఫిర్యాదు చేశామన్నారు. ఈ మేరకు ఆమె కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు (Union Home Minister Amit Shah) లేఖ రాశారు. నిందితుడిని పట్టుకొని చర్యలు తీసుకోవాలని కోరారు.