Viral video
Viral video | కుక్క తెచ్చిన గొడవ.. తుక్కుతుక్కు కొట్టుకున్న రెండు కుటుంబాలు.. ఎక్కడంటే..

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: VIRAL VEDIO : ప్రశాంతంగా ఉండే ఆ వీధిలో ఓ కుక్క చిచ్చు రాజేసింది. రెండు కుటుంబాలు తుక్కు తుక్కుగా కొట్టుకునేలా చేసింది. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్‌ Uttar Pradesh లోని మీరట్‌ Meerut లో చోటుచేసుకుంది. పల్లవ్‌పురం ఫేజ్-2లోని హై ప్రొఫైల్ కాలనీలో మే 7న ఒక మహిళ, ఆమె కుమార్తె నిషేధిత జాతి కుక్కతో ఆ కాలనీలో తిరగడం ఈ వివాదానికి కారణంగా చెబుతున్నారు. కుక్కను తిప్పొద్దన్నందుకు ఒక మహిళపై కుక్క యజమానురాలు దాడికి పాల్పడింది. అదికాస్త చినికి చినికి గాలివానలా మారింది.

నిందితురాలు తన కొడుకుతో పాటు మరికొంతమందిని తీసుకుని బాధిత మహిళ ఇంటికి వచ్చింది. వారంతా కలిసి సదరు బాధిత మహిళతోపాటు ఆమె భర్తను కూడా కొట్టారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు ఎనిమిది మందిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన మొత్తం సీసీ కెమెరాలో రికార్డు కావడంతో అదికాస్త.. నెట్టింట వైరల్​ అవుతోంది.

సదరు వీడియోలోని దృశ్యాలను పరిశీలిస్తే.. నిందితుడు వేదాంత్ మిశ్రా తన ఎర్రటి కారులో వచ్చి తన పొరుగింటి ముందర నిలిపాడు. తెల్లటి టీ – షర్ట్, షార్ట్స్‌ పై వచ్చిన వ్యక్తిని వీడియోలో చూడొచ్చు. తర్వాత మరో ఇద్దరు స్కూటర్​పై వచ్చారు. ఆ సమయంలో బాధిత మహిళ ఇంటి నుంచి బయటకు వచ్చింది. అప్పుడే తులికా మిశ్రా.. ఆమె వైపు దూసుకొచ్చి దాడికి దిగింది. ఆత్మరక్షణలో బాధిత మహిళ నిందితురాలిని తోసేసింది. ఆ తర్వాత బాధితురాలిపై అందరూ కలిసి దాడికి దిగారు.

ఆ దారిన వెళ్లేవారు జోక్యం చేసుకుని ఆపడానికి ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. అనంతరం పోలీసులకు బాధితురాలు ఆర్తి కదన్‌ ఫిర్యాదు చేశారు. నిషేధిత జాతి కుక్కను ఇంటి బయట తిప్పుతుండగా అభ్యంతరం చెప్పినందుకు తులిక మిశ్రా అనే మహిళ, ఆమె కుటుంబ సభ్యులు తనపై దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ టీవీ ఫుజేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.