అక్షరటుడే, వెబ్‌డెస్క్ : PM Modi | ఆపరేషన్ సిందూర్‌పై పార్లమెంట్‌లో చర్చకు పట్టుబట్టిన ప్రతిపక్షాలు బొక్కబోర్లా పడడంతో ఇప్పుడు చింతిస్తున్నాయని ప్రధాని మోదీ (Prime Minister Modi) ఎద్దేవా చేశారు. పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ప్రారంభించిన ఆపరేషన్ సిందూర్‌పై (Operation Sindoor) చర్చ కోరిన ప్రతిపక్షం ప్రభుత్వం ముందు నిలువలేక ఓటమి పాలైందని విమర్శించారు.
గత వారం పార్లమెంట్‌లో ఆపరేషన్ సిందూర్‌పై చర్చకు పట్టుబట్టిన ప్రతిపక్షం బొక్క బోర్లా పడిందని, తన కాలును తానే కాల్చుకుందని వ్యాఖ్యానించారు. ప్రతిపక్షం “స్వీయ హాని” చేసుకోవాలని పట్టుబడుతోందన్నారు. మంగళవారం పార్లమెంట్ ఆవరణలో ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ సమావేశం(NDA Parliamentary Party Meeting) జరిగింది. గతేడాది జూన్‌లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీజేపీ నేతృత్వంలోని కూటమి భేటీ కావడం ఇది రెండోసారి. ఈ సమావేశంలో పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత కేంద్రం మే 7న ప్రారంభించబడిన ఆపరేషన్ సిందూర్ గురించి మోదీ ఎన్డీయే సభ్యులకు వివరణ ఇచ్చారు.
PM Modi | సొంత నేతల నుంచే..
ప్రతిపక్షాలపై విమర్శలు ఎక్కుపెట్టిన ప్రధాని మోదీ.. ఆపరేషన్ సిందూర్‌పై చర్చ సందర్భంగా ప్రభుత్వం ముందు ప్రతిపక్షం నిలువలేక ఓడిపోయిందన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు వచ్చిన ఒకే ఒక్క అవకాశాన్ని కూడా వారు వినియోగించుకోలేక పోయారని ఎద్దేవా చేశారు. ఆ సమయంలో దేశ భద్రత విషయంలో వారి నిర్లక్ష్య ధోరణి.. సొంత పార్టీ నేతల్లోనే అభిప్రాయ భేదాలను బయట పెట్టిందన్నారు. ఇటువంటి ప్రతిపక్ష నేతలను ఇంకెక్కడా చూడలేదన్నారు. ఎప్పుడూ రాజ్యాంగం గురించి మాట్లాడే కాంగ్రెస్ నేతలు (Congress Leaders) తాము అధికారంలో ఉన్నప్పుడు ఏనాడూ కశ్మీర్లో రాజ్యాంగాన్ని అమలు చేయలేదన్నారు.
PM Modi | కేంద్రం విజయాలపై..
ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రసంగించిన ప్రధాని మోదీ, తన ప్రభుత్వం సాధించిన కీలక మైలురాళ్లను గుర్తు చేశారు. ముఖ్యంగా ఆర్టికల్ 370 రద్దు (Article 370 Repeal), రామమందిర నిర్మాణం వంటి అంశాలను ఆయన తన ప్రసంగంలో ప్రస్తావించారు. ఎన్నో ఏళ్లుగా ఉగ్రవాదం, వేర్పాటువాదంతో నలిగిపోతున్న కాశ్మీర్‌లో శాంతిభద్రతలను పునరుద్దరించామని చెప్పారు. కాశ్మీర్‌ను అభివృద్ధి బాటలో నడిపిస్తున్నామని, అక్కడ పర్యాటకరంగం వృద్ధితో పాటు పెట్టుబడులు పెరుగుతున్నాయన్నారు. ఎన్నో ఏళ్ల కల అయిన అయోధ్యలో రామమందిరం నిర్మాణం(Ram Temple Construction) పూర్తి చేశామన్నారు. ఆపరేషన్ సిందూర్ ద్వారా భారత సత్తాను ప్రపంచ దేశాలకు చూపించామన్నారు.
PM Modi | రాహుల్ పై విమర్శనాస్త్రాలు..
ఆపరేషన్ సిందూర్‌పై ప్రతిపక్షాల వైఖరిని ప్రధాని తీవ్రంగా తప్పుబట్టారు. సైన్యాన్ని, భద్రతా బలగాల స్థైర్యాన్ని దెబ్బ తీసేలా విపక్షాలు వ్యవహరించాయని మండిపడ్డారు. “తన పాదాలకు తానే గాయం చేసుకునే అలాంటి ప్రతిపక్షం మనకు ఎక్కడి నుండి వస్తుంది?” అని కాంగ్రెస్‌ను (Congress) ఉద్దేశించి విమర్శించారు. ఇక, రాహుల్‌గాంధీ(Rahul Gandhi)పై ప్రధాని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సుప్రీంకోర్టు ఇటీవల చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా ఆయన ఉటంకించారు. “ఆయన (రాహుల్) ఏదైనా చెబుతూనే ఉంటారు. ఆయన తరచుగా చిన్నపిల్లాడిగా ప్రవర్తిస్తారు. దేశం మొత్తం అతడి పిల్లచేష్టాల్ని చూసింది. సుప్రీంకోర్టు (Supreme Court) కూడా ఆయనను మందలించిందని” మోదీ ఎద్దేవా చేశారు. హోంమంత్రి అమిత్ షాను కూడా ఈ సందర్భంగా ప్రధాని ప్రశంసించారు. ఎక్కువ కాలం కేంద్ర హోంమంత్రిగా పని చేశారని పేర్కొన్నారు.
PM Modi | మోదీకి ఘన సత్కారం..
అంతకు ముందు పహల్గామ్ ఉగ్రవాద దాడికి వ్యతిరేకంగా ప్రభుత్వం స్పందించిన తీరును ప్రశంసిస్తూ ఎన్డీయే పక్షాలు ప్రధాని మోదీని ఘనంగా సత్కరించాయి. ఆయన అసాధారణ నాయకత్వాన్ని ప్రశంసించాయి. ఈ సందర్భంగా ప్రధానిని కీర్తిస్తూ తీర్మానాన్ని ఆమోదించాయి. “ప్రధాని మోదీ అచంచలమైన సంకల్పం, దార్శనిక రాజనీతిజ్ఞత, దృఢమైన ఆదేశం దేశాన్ని ముందుకు నడిపించడమే కాకుండా, భారతీయుల హృదయాలలో ఐక్యతను, నూతన స్ఫూర్తిని రగిలించాయి” అని సమావేశంలో తీర్మానం చేశారు.
ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత సాయుధ దళాలు చూపిన అద్భుతమైన ధైర్యం, అచంచలమైన నిబద్ధతను సమావేశం ప్రశంసించింది. “వారి (సైనికుల) ధైర్యం మన దేశాన్ని రక్షించడంలో వారి అచంచలమైన అంకితభావాన్ని హైలైట్ చేస్తుంది” అని పేర్కొంది. పహల్గామ్‌లో జరిగిన మారణ హోమంలో మృతి చెందిన వారికి సమావేశం నివాళులు అర్పించింది.
“ఆపరేషన్ సిందూర్, ఆపరేషన్ మహాదేవ్ (Operation Mahadev) రెండింటిలోనూ అసాధారణమైన వీరత్వాన్ని ప్రదర్శించిన మన సాయుధ దళాల అసాధారణ ధైర్యం, దృఢ అంకితభావానికి NDA పార్లమెంటరీ పార్టీ ప్రశంసించింది. దేశాన్ని కాపాడడంలో వారి అచంచలమైన నిబద్ధత వారి అంకితభావం, త్యాగానికి శక్తివంతమైన నిదర్శనంగా నిలుస్తుంది. పహల్గామ్‌లో జరిగిన దారుణమైన ఉగ్రవాద దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారిని మేము గౌరవిస్తాము వారికి మా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాము” అని తీర్మానంలో పేర్కొంది.