అక్షరటుడే, కామారెడ్డి : Panchayat Elections | తమ తండా నుంచి సర్పంచ్ అభ్యర్థిని బెదిరించి విత్ డ్రా చేయించి వాళ్ల తండా సర్పంచ్ అభ్యర్థిని (Sarpanch Candidate) ఏకగ్రీవం చేశారని పంతులు నాయక్ తండావాసులు ఆరోపించారు. ఈ మేరకు శనివారం జిల్లా కేంద్రానికి తరలివచ్చారు. జిల్లా ఎన్నికల నోడల్ అధికారికి విన్నవించారు. అంతకు ముందు కలెక్టరేట్ (Collectorate) వద్ద ఆందోళన చేపట్టారు.
Panchayat Elections | గాంధారి మండలంలోని..
ఈ సందర్భంగా పంతులు తండా వాసులు మాట్లాడుతూ.. తమ పంచాయతీ పరిధిలో సోమ్లా నాయక్, పంతులు నాయక్ తండాలు ఉన్నాయన్నారు. సోమ్లా నాయక్ (Somla Nayak) తండాలో మూడు వార్డులు ఉండగా 200 పైచిలుకు ఓటర్లు ఉన్నారని, తమ పంతులు నాయక్ తండాలో మూడు వార్డులు, 166 మంది ఓటర్లు ఉన్నారన్నారు. అయితే సోమ్లా నాయక్ తండా పంచాయతీగా ఏర్పడిన సమయంలో ఒకసారి వారికి, మరొక సారి తమ తండాకు సర్పంచ్ అవకాశం ఉండాలని నిర్ణయం తీసుకున్నామని వివరించారు.
Panchayat Elections | బెదిరించి విత్‌డ్రా చేయించారు..
గతంలో సోమ్లా నాయక్ తండా వారికి సర్పంచ్ అవకాశమిచ్చామన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో తమ తండా నుంచి సర్పంచ్ అభ్యర్థిగా లలిత గోప్యా నామినేషన్ వేయగా మీ తండాలో ఓటర్లు ఎక్కువ లేరని, నామినేషన్ వేసినా గెలవరని.. గెలవనివ్వబోమని సర్పంచ్ అభ్యర్థిని బెదిరించి విత్ డ్రా చేయించారని తెలిపారు. సోమ్లానాయక్ తండాకు చెందిన హరిత సంతోష్‌ను ఏకగ్రీవం చేశారని ఆరోపించారు.
Panchayat Elections | మాకు ఏకగ్రీవాలు అవసరం లేదు..
తమకు ఏకగ్రీవాలు అవసరం లేదని, రాజ్యాంగం ప్రకారం గెలిచినా ఓడినా ఎలక్షన్ ద్వారానే జరగాలని, వెంటనే ఏకగ్రీవం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా ఎన్నికల నోడల్ అధికారికి (Election Nodal Officer) వినతిపత్రం అందజేశారు. అనంతరం రాష్ట్ర ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్, జిల్లా నోడల్ అధికారి, గాంధారి ఎంపీడీవోలకు తండా వాసుల అభిప్రాయాన్ని రిజిస్టర్ పోస్టు ద్వారా పంపిస్తున్నట్టు తండా వాసులు తెలిపారు.