అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Kotha Prabhakar Reddy | దుర్గం చెరువు ఆక్రమించారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డిపై హైడ్రా (Hydraa) ఫిర్యాదు మేరకు కేసు నమోదైన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా ఆయన స్పందించారు.
అసెంబ్లీ వద్ద ప్రభాకర్‌రెడ్డి మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడారు. దుర్గం చెరువు భూమి కబ్జా కేసు పూర్తిగా నిరాధారం అని ఆయన కొట్టిపారేశారు. తనపై కక్షతో కేసు పెట్టారని ఆరోపించారు. తాము గతంలో అక్కడ రెండు ఎకరాలను వేలంలో కొనుగోలు చేసినట్లు తెలిపారు. కానీ ఆ భూమి ఎఫ్టీఎల్ పరిధిలో ఉందని అధికారులు చెప్పారన్నారు. భూమి కొనుగోలు చెల్లదని ప్రకటించి, టీడీఆర్ జారీ చేశారన్నారు. దీంతో తాను ఆ భూమిని వెనక్కి ఇచ్చినట్లు తెలిపారు. ఆ తర్వాత దుర్గం చెరువును అభివృద్ధి చేశారని చెప్పారు. పక్కనే ఉన్న భూములు నటుడు బాలకృష్ణ (Actor Balakrishna), లహరి ఎస్టేట్స్ (Lahari Estates) వారి హరిబాబుకు చెందినవన్నారు.
Kotha Prabhakar Reddy | నాకు అక్కడ భూమి లేదు
ప్రైవేట్ వాహనాల పార్కింగ్‌కు అనుమతించినందుకు తనపై కేసు నమోదు చేశారని కొత్త ప్రభాకర్‌రెడ్డి చెప్పారు. దుర్గం చెరువు వద్ద తనకు ఎలాంటి భూమి లేదని స్పష్టం చేశారు. ఒక్క అంగుళం ప్రభుత్వ భూమిని ఆక్రమించానని నిరూపించినా, ఎలాంటి చర్యలనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. రోడ్డుపై, చెట్ల కింద వాహనాలను పార్క్ చేసినందుకు కేసు పెట్టారని చెప్పారు. ఆ ప్రదేశంలో ప్రభుత్వ భూమి లేదన్నారు. నిత్యం అక్కడ ప్రైవేట్ బస్సులు (Private Buses) పార్క్ చేస్తారన్నారు. పోలీసులు తన సిబ్బందికి కేసు వివరాలు తెలిపారని చెప్పారు. దీనిని చట్టబద్ధంగా ఎదుర్కొంటానని తెలిపారు. పోలీసులకు సహకరిస్తానన్నారు. కేసును బేషరతుగా ఉపసంహరించుకోకపోతే ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మించిన ఇళ్ల ముందు నిరసన తెలుపుతానని ఆయన హెచ్చరించారు.