అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Supreme Court | జిల్లా జడ్జీల నియామకంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏడేళ్లపాటు అడ్వకేట్‌గా ప్రాక్టీసు చేసిన అనంతరం కింది కోర్టుల జడ్జీలుగా నియమితులైన వారు బార్ అసోసియేషన్(Bar Association) కోటా కింద జిల్లా జడ్జీలుగా నియామకానికి అర్హులనేని తేల్చింది. ఈ మేరకు గురువారం తీర్పు చెప్పింది.
న్యాయవాదులుగా ప్రాక్టీస్ చేసి న్యాయాధికారులుగా నియమితులయ్యే సివిల్ జడ్జీ(Civil Judge)లు కూడా బార్ కోటా కింద జిల్లా జడ్జీ(District Judge) నియామక పరీక్షకు హాజరయ్యేలా అవకాశం కల్పించాలని సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం గురువారం తీర్పు వెలువరించింది. న్యాయవాదుల కోసమే ఉన్న ప్రత్యేక నియామక ప్రక్రియ కింద వారు న్యాయమూర్తులుగా నియమితులు కావొచ్చని తెలిపింది. ఈ మేరకు రాష్ట్రప్రభుత్వాలు నిబంధనలు సవరించాలని సూచించింది.
Supreme Court | కనీస వయసు ఎంతంటే..
సమాన అవకాశాలు కల్పించడానికి, జిల్లా న్యాయమూర్తుల ప్రత్యక్ష నియామకానికి దరఖాస్తు చేసుకునే ఇన్-సర్వీస్ అభ్యర్థుల కనీస వయస్సు 35 సంవత్సరాలు ఉండాలని కోర్టు పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వాలు ఇన్-సర్వీస్ అభ్యర్థులకు అర్హత కల్పించే నియమాలను రూపొందించాల్సి ఉంటుందని కోర్టు(Supreme Court) పేర్కొంది. ధీరజ్ మోర్ కేసులో సర్వీస్‌లో ఉన్న అభ్యర్థులు జిల్లా న్యాయమూర్తులుగా ప్రత్యక్ష నియామకం కోరలేరని ఇచ్చిన తీర్పును ధర్మాసనం తోసిపుచ్చింది.