అక్షరటుడే, వెబ్‌డెస్క్ : KTR | సిట్ విచారణపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. సిట్ అధికారులు ఆయనను ఏడు గంటల పాటు ప్రశ్నించారు. అనంతరం ఆయన తెలంగాణ భవన్ (Telangana Bhavan)లో మాట్లాడారు.
సిట్ (SIT) అధికారులు అడిగిన ప్రశ్నలే అడిగి టైమ్ పాస్ చేశారన్నారు. 300 మంది పేర్లు చదివారని చెప్పారు. ఏ విచారణకైనా తాము సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. బాధ్యతగల ప్రతిపక్ష పార్టీగా పూర్తిగా సహకరిస్తామన్నారు. కిషన్ రావుతో కలిసి తనను విచారించారనడంలో వాస్తవం లేదన్నారు. అక్కడ పోలీసులు, తాను మాత్రమే ఉన్నామని చెప్పారు.
KTR | దృష్టి మళ్లించడానికి..
కాంగ్రెస్ (Congress) అసమర్థ పాలన నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి సిట్ విచారణ పేరిట డ్రామాలు ఆడుతున్నారని కేటీఆర్ విమర్శించారు. మీడియాలో వస్తున్న లీకు వార్తలకు తమకు సంబంధం లేదని విచారణ అధికారులు చెప్పినట్లు తెలిపారు.ప్రభుత్వం ఇచ్చే లీకుల విషయంలో మీడియా కూడా ఆలోచించాలని ఆయన కోరారు. రెండేండ్లుగా లీకుల మీద లీకులతో తమ పార్టీ లీడర్ల వ్యక్తిత్వ హననం చేస్తున్నారని మండి పడ్డారు. తమకు కుటుంబాలు ఉంటాయని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి లీకులను ప్రచురించవద్దని మీడియాను ఆయన కోరారు. దానిలో వాస్తవం ఎంతో, అవాస్తవం ఎంతో చెక్ చేసుకోవాలన్నారు.
ప్రతిపక్షంలో ఉన్న తమ ఫోన్లు కూడా ట్యాప్ చేస్తున్నారు కదా అని సిట్ అధికారులను అడిగినట్లు కేటీఆర్ చెప్పారు. అయతే వాళ్ళు ‘‘మాకేం సంబంధం, మాకు తెలియదు అని అంటున్నారు తప్ప మేము ట్యాప్ చెయ్యడం లేదు అని అనడం లేదు” అన్నారు.
KTR | పోలీసుల ప్రకటన
కేటీఆర్ విచారణపై పోలీసులు ప్రకటించారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ (Panjagutta Police Station) క్రైమ్ నంబర్ 243/2024 కేసు దర్యాప్తులో భాగంగా కేటీఆర్‌ను విచారించినట్లు తెలిపారు. కేసుకు సంబంధించిన కీలక అంశాలను రాబట్టడంతో పాటు రికార్డులో ఉన్న సాక్ష్యాధారాలతో వాటిని విశ్లేషిస్తున్నామని పేర్కొన్నారు. అవసరమైతే విచారణకు మళ్లీ హాజరుకావాల్సి ఉంటుందని కేటీఆర్‌కు తెలిపామన్నారు.