అక్షరటుడే, బాల్కొండ : MLA Prashanth Reddy | రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రంగా ధ్వజమెత్తారు. 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం బాల్కొండ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఘాటుగా స్పందించారు.
MLA Prashanth Reddy | భిన్నత్వంలో ఏకత్వం..
భిన్నత్వంలో ఏకత్వంతో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారత్ నిలవడానికి అంబేద్కర్ రచించిన రాజ్యాంగమే కారణమని ప్రశాంత్‌రెడ్డి కొనియాడారు. ‘మనందరికీ భగవద్గీత, బైబిల్, ఖురాన్ లాంటిది – భారత రాజ్యాంగమే’ అని వ్యాఖ్యానించారు. వందేళ్ల తర్వాత కూడా దేశ పరిస్థితిని ఊహించి, అనేక మంది మేధావులతో చర్చించి అంబేద్కర్ రాజ్యాంగాన్ని రూపొందించారని గుర్తు చేశారు.
MLA Prashanth Reddy | అసెంబ్లీ సమ్మతి లేకుండా రాష్ట్రం..
ఒక రాష్ట్రం నుండి మరొక రాష్ట్రం విడిపోవాలంటే అసెంబ్లీ సమ్మతి తప్పనిసరి అన్న వాదన ఉన్నప్పటికీ, చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు అంబేద్కర్ దూరదృష్టితో రాజ్యాంగంలో ఆర్టికల్–3ను పొందుపరిచారని తెలిపారు. అదే ఆర్టికల్ కారణంగానే, అసెంబ్లీ తీర్మానం లేకపోయినా పార్లమెంట్ నిర్ణయంతో తెలంగాణ రాష్ట్రం (Telangana State) ఏర్పడిందని స్పష్టం చేశారు. రాజ్యాంగం ప్రతి పౌరుడికి ప్రశ్నించే హక్కును కల్పించిందని, కానీ రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రభుత్వం ప్రశ్నించే గొంతులను నొక్కేస్తోందని మండిపడ్డారు. ఇచ్చిన హామీలను గుర్తుచేస్తే పోలీసులను, సిట్‌ను, కమిషన్లను అడ్డం పెట్టుకొని ప్రతిపక్ష నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ (KCR), కేటీఆర్ (KTR) , హరీష్ రావు (Harish Rao) వంటి నేతలను విచారణల పేరుతో వేధించడం సరికాదన్నారు.
MLA Prashanth Reddy | సింగరేణి టెండర్లలో భారీ అవినీతి..
సింగరేణి బొగ్గు టెండర్ల వ్యవహారంలో భారీ అవినీతి జరిగిందని, ఈ కుంభకోణంపై ప్రతిపక్షం ప్రశ్నిస్తే నోటీసులు ఇచ్చి వేధిస్తున్నారని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై ‘సిట్టింగ్ జడ్జి’తో న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. తక్షణమే మహిళలకు నెలకు రూ.2,500, వృద్ధులకు రూ.4,000 పెన్షన్, నవవధువులకు తులం బంగారం, యువతకు 2 లక్షల ఉద్యోగాలు, రూ.4,000 నిరుద్యోగ భృతి, రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ, రూ.15,000 రైతుబంధు, వడ్లకు రూ.500 బోనస్ హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. గణతంత్ర దినోత్సవ (Republic Day) స్ఫూర్తితోనైనా ప్రభుత్వం తన పద్ధతి మార్చుకొని రాజ్యాంగబద్ధంగా పాలన సాగించాలని సూచించారు. లేనిపక్షంలో రాజ్యాంగం కల్పించిన హక్కులతోనే ప్రజల పక్షాన పోరాడతామని, ప్రజలు తమ ఓటు ద్వారా తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.