అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Hydraa | హైదరాబాద్ (Hyderabad) నగరంలో అక్రమ నిర్మాణాలు కూలగొట్టడం మాత్రమే కాదని, పర్యావరణ హిత నగర నిర్మాణమే హైడ్రా లక్ష్యమని కమిషనర్ రంగనాథ్ (Ranganath) అన్నారు. హైడ్రా అంటే భయం కాదని.. నగర ప్రజలందరికీ అభయం అని పేర్కొన్నారు.
చెరువులు, నాలాలు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలను కబ్జా చేసిన వారు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టాలని ఆయన కోరారు. ఐదు ఎకరాల భూమిని కబ్జా చేసి అందులో పని వాళ్లకోసం ఒక షెడ్డు వేస్తున్నారని కమిషనర్ పేర్కొన్నారు. దానిని తొలగించినప్పుడు వారిని ముందుంచి గేమ్ ఆడి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. హైడ్రా బస్తీతో దోస్తీ కార్యక్రమంలో భాగంగా శనివారం టోలీచౌక్ (Tolichowki) ప్రాంతంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
Hydraa | ఎప్పుడూ పేదల పక్షమే..
హైడ్రా ఎప్పుడూ పేదలు, సామాన్యుల పక్షమే అని కమిషనర్ పేర్కొన్నారు. హైడ్రాను బూచిగా చూపించి కబ్జాలను, ఆక్రమణలను కాపాడుకోడానికి బడాబాబులు దుష్ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. ఆ ప్రచారాన్ని తిప్పి కొట్టాలని కోరారు. పేదలు ఎక్కడైనా ఇల్లు నిర్మించుకుని ఉంటే వాటిని తొలగించబోమని స్పష్టం చేశారు. ఒక వేళ తప్పనిసరిగా ఆ నిర్మాణాన్ని తొలగించాల్సి వస్తే.. వారికి ప్రత్యామ్నాయంగా ఎక్కడైనా నివాసాన్ని చూపించిన తర్వాతే హైడ్రా ముందుకు వెళ్తుందన్నారు.
Hydraa | మూసీ నదిని ఆక్రమించి నెలకు రూ.కోటి ఆదాయం
మూసీ నది (Musi River) సుందరీకరణతో హైడ్రాకు సంబంధం లేదని కమిషనర్ స్పష్టం చేశారు. అయితే ఇటీవల మూసీ నదిని ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను తొలగించామన్నారు. కొందరు వ్యక్తులు 10 ఎకరాల మేర నదిని కబ్జా చేసి నెలకు రూ. కోటి ఆదాయం పొందుతున్నారని చెప్పారు. వారి షెడ్లను కూల్చి వేశామని ఆయన తెలిపారు.
Hydraa | చెరువుల పరిరక్షణ అందరి బాధ్యత
నాలాలను, చెరువులను పరిరక్షించడం అందరి బాధ్యత అని హైడ్రా కమిషనర్ తెలిపారు. షేక్‌పేట, టోలీచౌక్‌లోని నాలాల్లో పరుపులు, దిండులు, ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోవడంతో గతంలో వరద ముంచెత్తిందన్నారు. అయితే పది రోజులుగా నాలాల పూడికను తొలగించడంతో ఇప్పుడు వరద సాఫీగా సాగుతోందన్నారు. నాలాలో చెత్త వేయకుండా స్థానికులు చర్యలు చేపట్టాలని ఆయన కోరారు.