అక్షరటుడే, వెబ్‌డెస్క్ : KTR | కేసీఆర్‌కు పేరు వస్తుందని ప్రాజెక్ట్‌లను పూర్తి చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) పక్కన పెట్టిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో గురువారం ఆయన మాట్లాడారు.
కేసీఆర్‌కు పేరు వస్తుందని, తన గురువుకు కోపం వస్తుందని సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) 90 శాతం పనులు పూర్తయిన పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టును పక్కన పెట్టారన్నారు. కొల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్లో చేరారు. ఈ కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్ష, మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
KTR | జూపల్లి మళ్లీ గెలవడు
కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ తిరిగి వస్తుందో.. రాదో తెలియదని, తాను కూడా గెలుస్తానో లేదోనని మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) గతంలో చెప్పారన్నారు. అయితే కృష్ణారావును ఎట్టి పరిస్థితుల్లో గెలిపించబోమని కొల్లాపూర్ ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారని పేర్కొన్నారు. మంత్రి పదవిని కాపాడుకోవడానికి జూపల్లి కృష్ణారావు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అవకాశవాదంతో కాంగ్రెస్‌లోకి పోయిన నాయకుడు జూపల్లి అని విమర్శించారు.
KTR | ఎగవేతలు.. కూల్చివేతలు
కాంగ్రెస్ పార్టీ (Congress Party) ఎగవేతలు, కూల్చివేతలు, పేల్చివేతలు తప్ప చేసింది ఏమీ లేదన్నారు. ఆరు గ్యారెంటీలను ఎగవేస్తూ.. హైడ్రా వంటి అరాచక విధానాలతో ఇండ్లను కూల్చివేస్తున్నారని విమర్శించారు. చెక్ డ్యామ్‌లను కాంగ్రెస్ నాయకులు పేల్చి వేస్తున్నారని ఆరోపించారు. పాలమూరు ప్రాజెక్టును పక్కనబెట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పాత బాస్ చంద్రబాబుకు కోపం వస్తుందని పాలమూరును పట్టించుకోవడం లేదన్నారు.
KTR | కేసీఆర్ మళ్లీ సీఎం కావాలి
తెలంగాణలోని ఏ ప్రాంతం ఏ బేసిన్లో ఉందో కూడా సీఎంకు తెలియదని ఎద్దేవా చేశారు. బాక్రానంగల్ ఎక్కడుందో కూడా ఆయనకు తెలియదన్నారు. కాంగ్రెస్ పార్టీ అరాచకాల నుంచి తెలంగాణను కాపాడుకోవాలి అంటే కేసీఆర్ (KCR) ముఖ్యమంత్రి కావాలన్నారు. ఇందుకోసం పార్టీ శ్రేణులంతా కలిసికట్టుగా పనిచేయాలని కేటీఆర్ సూచించారు. మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలలో గట్టిగా కొట్లాడి గెలవాలన్నారు.