అక్షరటుడే, వెబ్‌డెస్క్: CP Sajjanar | హైదరాబాద్ సీపీ సజ్జనార్ (Hyderabad CP Sajjanar) సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటారు. వివిధ అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తుంటారు. తాజాగా ఆయన కర్నూల్ బస్సు ప్రమాదంపై (Kurnool bus accident) స్పందించారు.
మద్యం తాగి వాహనాలు నడిపే వారు ఉగ్రవాదులతో (Terrorists) సమానమని సీపీ సజ్జనార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’ వేదికగా పోస్టు పెట్టారు. కర్నూల్ జిల్లా చిన్నటేకూరు సమీపంలో రోడ్డుపై పడి ఉన్న బైక్‌ను ఢీకొని బస్సు దగ్ధమైన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 20 మంది సజీవ దహనం అయ్యారు. డీఎన్ఏ పరీక్ష (DNA tests) చేసి బాధిత కుటుంబ సభ్యులకు మృతదేహాలు అప్పగిస్తున్నారు. తాజాగా ఈ ఘటనపై సీపీ సజ్జనార్ పోస్ట్ పెట్టారు.
CP Sajjanar | ఒక్కరి నిర్లక్ష్యంతో..
ఒక్కరి నిర్లక్ష్యం 20 మంది ప్రాణాలను బలి తీసుకుందని సీపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం మత్తులో వాహనాలతో రోడ్డుపైకి వచ్చి అమాయకుల ప్రాణాలను పొట్టనబెట్టుకునే వాళ్లు టెర్రరిస్టులు, మానవ బాంబులు (human bombs) కాక ఇంకేమవుతారు అని ఆయన ప్రశ్నించారు. వాళ్ళు చేసిన ఈ తప్పిదం వల్ల ఎన్ని కుటుంబాలు మానసిక క్షోభను అనుభవిస్తున్నాయన్నారు. ‘‘మీ సరదా, జల్సాల కోసం ఇతరుల ప్రాణాలను తీసే హక్కు మీకు ఎవరిచ్చారు”అని ప్రశ్నించారు.
CP Sajjanar | వారిని వదిలిపెట్టొద్దు
సమాజంలో మన చుట్టే తిరిగే ఇలాంటి టెర్రరిస్టులు, మానవ బాంబుల విషయంలో జాగ్రతగా ఉండాలని ఆయన సూచించారు. వీరి కదలికలపై వెంటనే డయల్ 100 కి గానీ, స్థానిక పోలీసులకు గానీ సమాచారం అందించాలన్నారు. వాళ్ళను అలాగే వదిలేస్తే రోడ్డు మీదకు వచ్చి ఎంతో మందిని చంపేస్తారన్నారు. కర్నూలు బస్సు ప్రమాదం నిజమైన అర్థంలో ప్రమాదం కాదన్నారు. తాగిన బైకర్ నిర్లక్ష్యం, బాధ్యతారహిత ప్రవర్తనతో జరిగిందన్నారు.
కాగా శివశంకర్ అనే వ్యక్తి మద్యం మత్తులో బైక్ నడపడంతో కింద పడిపోయాడు. ఆయన అక్కడికక్కడే మృతి చెందగా.. రోడ్డుపై పడి ఉన్న బైక్‌ను వేమూరి కావేరి ట్రావెల్స్‌కు (Vemuri Kaveri Travels) చెందిన బస్సు ఢీకొంది. బైక్ బస్సు కింద చిక్కుకోవడంతో మంటలు వ్యాపించి 20 మంది చనిపోయారు.